బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (12:02 IST)

తిరుపతి లడ్డూ రుచి ఏమయ్యింది...? డయల్ యువర్ ఈవోలో భక్తులు

సార్... తిరుమల లడ్డూ రుచి బాగా తగ్గింది ఎందుకని? తగినన్ని మోతాదులో దినుసులు వేయడం లేదా...? పరిస్థితులను గమనించండి అంటూ భక్తులు తిరుమల తిరుపతి  దేవస్థానం ఈవో డి.సాంబశివరావులను ప్రశ్నించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనేకమైన సమస్యలను వారు లేవనెత్తారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల శ్రీవారి లడ్డూ రుచి తగ్గిందని కడపకు చెందిన కృష్ణకాంత్‌రెడ్డి, చిత్తూరుకు చెందిన గోపి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇందులో తేడా ఏమి ఉండదనీ, అయినా సరే పరిశీలిస్తామని ఈవో వారికి సమాధానం చెప్పారు. 
 
అనధికార హాకర్స్‌ మాఫియాను అరికట్టాలని తిరుపతికి చెందిన కుమార్‌ అనే భక్తుడు ఈవో దృష్టికి తెచ్చారు. కాలి నడక మార్గంలో చిరుతలు కనిపిస్తుండటంతో భయమేస్తుందని జయలక్ష్మి (యూఎస్‌ఏ) తెలిపారు. ప్రధానంగారూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ విధానంపై సూర్యసుబ్రహ్మణ్యం(పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ),రామస్వామి(బెంగళూరు), వెంకటసూరప్పరావు(విశాఖ జిల్లా,కొత్తపాళెం),శ్రీనివాస్‌(కామారెడ్డి), రేఖ(చెన్నై), రాజ్‌ (తిరునల్వేలి), హేమలత(హైదరాబాద్‌) తదితరులు పలు సందేహాలను వ్యక్తం చేశారు. 
 
దీనిపై ఈవో మాట్లాడుతూ.. రూ.300 టికెట్లు సులభంగా లభించేలా కోటాను పెంచి.. ఆన్‌లైన్‌ విధానాన్ని మరింత సరళీకృతం చేశామన్నారు. తిరుపతి లోని విష్ణునివాసం గదుల కేటాయింపులో అక్కడి సిబ్బంది సరిగా సమాధానం ఇవ్వడం లేదని శ్రీనివాస్‌(నరసన్నపేట) ఈవో దృష్టికి తెచ్చారు. శ్రీవారి సేవకు వస్తున్న వారికి జ్ఞాపిక లేక ధ్రువీకరణపత్రం ఇవ్వాలని కమలాకర్‌(నెల్లిమర్ల, విజయనగరం) కోరారు. 
 
తిరుత్తణిలో టీటీడీ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కుమరేష్‌ (తిరుత్తణి) కోరారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1, 2లలో వైద్యసదుపాయం లేదని బ్రహ్మం(గుంటూరు) తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు తాగునీరు, ఎనర్జీ డ్రింక్స్‌ అందించాలని శేఖర్‌(మహబూబ్‌నగర్‌) కోరారు.