బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 25 జులై 2015 (11:01 IST)

టీటీడీ కళ్యాణ మండపంలో డిష్యుం.. డిష్యుం.. సిబ్బందిపై తిరగబడ్డ భక్తులు... ఎక్కడ?

తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలోని శుక్రవారం ఉదయం తితిదే సిబ్బంది, భక్తులు బాహాబాహీకి దిగారు. తోపులాడుకున్నారు. తిట్టుకున్నారు. కొట్టుకునే పరిస్థితి ఏర్పండింది. భక్తులు టీటీడీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
గుంటూరులోని రాజుగారితోటలోని కల్యాణ మండపం ఆవరణలోని ఈ-దర్శన కేంద్రంలో శ్రీవారి నిత్య సేవల టోకెన్లు తీసుకోవడానికి శుక్రవారం వేకువజామున భక్తులు విచ్చేశారు. అయితే అక్కడున్న సిబ్బంది వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్‌ 16 నుంచి 24 వరకు నిత్య సేవలు జారీ నిలిపివేశారని తెలియజేస్తూ ఓ కాగితంపై ఈ-దర్శన కేంద్ర ఉద్యోగి నోటీసు బోర్డులో అంటించాడు. 
 
అయితే టోకెన్లు వస్తాయని కల్యాణ మండప ఉద్యోగి చెప్పడంతో వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు వేచి ఉన్నామని భక్తులు వాపోయారు. ఈ దర్శన కేంద్ర సిబ్బంది వచ్చి సదరు భక్తులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే అధికారులు అన్ని కేంద్రాల్లో టోకెన్లు నిలిపివేసినట్లు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ చూపాడు. ఈ విషయమై భక్తులు కల్యాణ మండప ఉద్యోగిని నిలదీయగా గుంటూరులోని ఈదర్శన సిబ్బందికి టిక్కెట్లు ఇవ్వడం చేతకాక అలా సమాధానమిస్తున్నారు.. మిగిలిన కేంద్రాల్లో వస్తున్నాయంటూ మళ్లీ తప్పుదోవ పట్టించాడు. 
 
మిగతా కేంద్రాలలో కూడా టికెట్ల జారీ నిలిపేశారని తెలుసుకున్న సిబ్బంది అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కల్యాణ మండపం ఉద్యోగికి అనుకూలంగా ఉండే కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి గొడవకు దిగడం, దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ-దర్శన సిబ్బందితోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తితిదే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయవద్దని హెచ్చరించారు.