శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ivr
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2015 (21:14 IST)

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఐదు గంటలకు లేచి....

కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుంటే.. సకల సంపదలు చేకూరతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి.
 
 
తలస్నానం చేసి, తెలుపు దుస్తులను ధరించి శివ పార్వతీదేవీల పటానికి పసుమ కుంకుమపెట్టి తెల్లటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా బూరెలు, గారెలు, అన్ని ఫలాలను సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
దీపారాధనకు మట్టి ప్రమిదలు, 1008 వత్తులు తీసుకోవాలి. నక్షత్రహారతికి ఆవునేతిని దీపారాధనకు నువ్వులనూనె వాడాలి. నుదుట విభూది ధరించి, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. జపమునకు రుద్రాక్ష మాల వాడాలి. పూజచేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో మహానాస్యక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశరుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
 
అదే విధంగా శివ పంచాక్షరీ స్తోత్రము, శివ సహస్ర నామము, శివపురాణములను పారాయణం చేసినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలకు వెళ్లి... అందులో ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి.