మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (07:21 IST)

తిరుమలలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

తిరుమలలో పవిత్రోత్సవాలు వైభవంగా మంగళవారం ఆరంభమయ్యాయి. శ్రీవారికి సుప్రభాతం, మొదటి నైవేద్యం, రెండో ఘంట అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పల్లకిని అధిరోహించి పవిత్రోత్సవ మండపానికి వేంచేశారు. మండపంలో అర్చకస్వాములు ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ట చేసి వీటి మధ్య నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారు. స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని ఆశీనుల్ని చేశారు. పట్టుపవిత్రాలను యాగశాలలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. 
 
హోమం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేసి హోమతిలకం పెట్టిన అనంతరం భక్తులతో సంకల్పం చెప్పించారు. అనుష్ఠాన క్రియల అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలను అలంకరిస్తుండగా జీయంగార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధాన్ని పారాయణం చేశారు. 
 
ఏకాంతంగా నైవేద్యం నివేదన జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి సర్వాభరణాలతో, రంగురంగుల పుష్పమాలలతో అలంకరించి తిరువీధుల్లో అత్యంత వైభవంగా వూరేగించారు.