శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PYR

తిరుమలలో వెండి డాలర్ల కొరత... ! అవి విఐపీలు కొనేవి కావుగా..!! వదిలేయ్ అంటున్న టీటీడీ

భక్తులు అత్యంత భక్తితో కొనుగోలు చేసే శ్రీవారి డాలర్లు తిరుమలలో కరువయ్యాయి. నెల కాదు రెండు నెలలు కాదు. రెండేళ్ళుగా వెండి డాలర్లు మచ్చుకు కూడా అక్కడ దర్శనం ఇవ్వడం లేదు. సామాన్య భక్తుల ప్రాధాన్యతపై నీతులు వల్లించే టీటీడీ అధికారులు సామాన్య భక్తులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈ డాలర్లపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనేది వెంకన్న ఎరిగిన సత్యం. కనీసం అక్కడ డాలర్లు లేవనే ధ్యాసే వారిలో లేదు. విఐపిలకు అవసరమైన, వారు కొనుగోలు చేయగలిగే సత్తా ఉన్న బంగారు డాలర్లకు ఇచ్చే ప్రాధాన్యత వీటికి ఇవ్వడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. 
 
తిరుమలలో ఆలయం పక్కన శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇక్కడ శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల ప్రతిమలు కలిగిన వెండి, బంగారు డాలర్లను విక్రయిస్తారు. ఈ డాలర్లను కొనుగోలు చేయడం వాటిని ధరించడం అపురూపంగా భావిస్తారు. తమ సమీప బంధువులకు ఉచితంగా పంచడం ఆనవాయితీ. 5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించి ఇక్కడ విక్రయిస్తుంది. వీటి ధర రూ.100 నుంచి రూ.250లోపే ఉంటుంది. తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. లడ్డూ ప్రసాదాలతో పాటు వాటిని కూడా ఇస్తారు. 
 
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం రెండేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. రెండేళ్లుగా వీటిని తయారు చేయడం టిటిడికి చేత కాలేదా... లేక తయారు చేసే వారు అంత నిపుణత కలిగి లేరా అనేది సందేహం. దీనిపై సామాన్య భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. రెండు గ్రాముల బంగారు డాలర్ల్లది ఇదే స్థితి. ఆలయ విభాగం తన ఆధీనంలోనే ఉండే ఈ కౌంటర్‌లోని డాలర్ల స్టాకు సంగతి తెలియదని చెబుతోంది. ఇంతకీ కారణం ఏమిటా అని ఆరా తీస్తే వీటి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం అత్యల్పం. పైగా ఇవేవి విఐపి భక్తులు కొనుగోలు చేసేవి కాకపోయే... ఇక పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఇదండీ సామాన్య భక్తులపై టీటీడీకి ఉన్న శ్రద్ధ.