శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (17:57 IST)

ఆ బంగారు జింకను సీతమ్మ ఎవరికి కానుకగా ఇవ్వాలనుకుంది!

''పోతే రాముడు చేతిలో చస్తాను. పోకపోతే రావణుడి చేతిలో చస్తాను. నేను చావడం ఖాయం. అయితే రావణుని మాట వినకుండా అతని చేతిలో చావటం కంటే.. అతని ఆదేశానుసారం అడవిలోకి వెళ్ళి రాముడి చేతిలో చావడం ఎంతో మేలుకరము, మోక్షదాయకము అని మారీచుడు ఆలోచించి రావణుడు చెప్పినట్లుగా బంగారు జింక వేషము వేసికొని సీత రాముడు లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి దగ్గరగా వెళ్ళాడు. అక్కడ సీత ఓ బంగారు జింకను చూసి అది తనకు కావలెనని రాముడిని అడిగినది. ఆ జింక యొక్క అందానికి సీత ఎంతో ముగ్ధురాలైనది. 
 
రాముడు కూడా ఆ బంగారు జింకను చూసి చాలా ఆశ్చర్యము పొందాడు.  ఆ బంగారు జింక ప్రాణములతో కానీ, ప్రాణము లేకుండినను సీత తనకు కావలెనని కోరింది. ప్రాణాలతో దొరికితే తన ఆశ్రమములో ఆ జింకతో ఆడుకొని తర్వాత అయోధ్యకు తీసుకుని వెళ్ళి తన అత్తమామలకు కానుకగా ఇస్తాను, లేకపోతే దాని బంగారు వర్ణము కలిగిన చర్మాన్ని ఆసనముగా  వేసుకుంటాను. అని చెప్పి ఆ బంగారు జింక తనకు ఎట్టిపరిస్థితులలోను కావలెనని రాముడిని అడిగింది సీత. లక్ష్మణుడు అది మాయలేడి అని గమనించి అన్నకు చెప్పాడు. అది ఖచ్చితముగా మారీచుని మాయేనని చెప్పాడు. 
 
ఆ మాటలు విన్న సీతకు లక్ష్మణునిపై కోపం వచ్చింది. రాముడు, సీతపైన వున్న ప్రేమ అనురాగంతో ఆ బంగారు జింకను తీసుకుని వస్తానని బయలుదేరుతాడు. ఆ జింక తన మాయలచేత రాముడిని, సీత లక్ష్మణులు వున్న ప్రదేశానికి దూరంగా తీసుకుని వస్తానని బయలుదేరాడు. ఆ జింక తన మాయలచేత రాముడిని, సీత లక్ష్మణులు వున్న ప్రదేశానికి దూరంగా తీసుకుని వెళ్ళింది. ఎంతసేపటికి ఆ మాయల జింక రాముడికి దొరకకుండా తప్పించుకుంది. దీంతో సహనం కోల్పోయిన రాముడు జింక గుండెల్లోకి బాణాన్ని వదిలాడు. ఆ బాణం దెబ్బకు జింక ప్రాణాలు వదిలింది. కాని ప్రాణాలు వదిలేటప్పుడు ''హా! సీతా! హా లక్ష్మణా!"అని బిగ్గరగా అరిచింది. 
 
ఆ అరుపు రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. సీతాపహరణ జరిగింది. సీతకు కష్టాలు తీసుకుని వచ్చింది. రాముడికి దుఃఖాన్ని కలిగించింది. రామునికి హనుమతునితో సుగ్రీవునితో మైత్రి కలిపింది. వాలిని హతమార్చింది. జటాయువు మోక్షం కలిగించింది. లంకను తగలబెట్టింది. రామరావణ యుద్ధం జరిగింది. రావణుణ్ణి రాముడి చేతుల్లో చంపించింది. సీతారాముల కలయిక జరిగింది. శ్రీరామపట్టాభిషేకం జరిపించింది. రెండే రెండు పదాలు తప్పుగా మారీచుడు ఉచ్చరించిన దానివలన సీతారాముల జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించవలసి వచ్చినది. మనం దైనందిన జీవితములో ఎన్నో విషయములు మాట్లాడుతూ.. వుంటాము. ఎన్నోచోట్ల తెలిసితెలియక తప్పుడు పదాలు ఉపయోగిస్తుంటాం. దాని ఫలితాలను మనం స్వయంగా అనుభవించినప్పుడు తప్ప మిగతా సమయంలో వాటిని మనం పట్టించుకోము. ఆ మాటలు ఎదుటివారిని ఎంత ఇబ్బంది పెట్టాయో అని ఆలోచించము. 
 
''హా! సీతా! హా లక్ష్మణా!" అన్న మాటలు వినగానే సీత మనస్సు ఒక్కసారిగా విలవిలలాడిపోయింది. రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని అనుమానించింది. లక్ష్మణునిని వెళ్ళి చూసిరమ్మని అడిగింది. ఆ అరుపులు రాముడివి కావు. ఆ మాయలమారి మారీచుడివి అని సీతకు లక్ష్మణుడు నచ్చజెప్ప ప్రయత్నించెను.  రాముడు పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, ధైర్యశాలి ఇంద్రునితో సమానముగా యుద్ధం చేయగలిగినవాడు, అతనికి ఎటువంటి ఆపద కలుగదు అని లక్ష్మణుడు సీతకు చెప్పాడు. కానీ సీత ఆ మాటలు చెవిన పెట్టలేదు. పైగా లక్ష్మణ స్వామిని నిందించడం మొదలుపెట్టింది.