శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (08:25 IST)

కలకాలం నిలిచేలా తిరుమలలో వేయికాళ్ళ మండపం... ఛైర్మన్ చదలవాడ

కలకాలం నిలిచేలా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపాన్ని పునఃనిర్మిస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పునాది రాయి వేస్తారని అన్నారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా మండపం నిర్మాణ ఆకృతులపై ఇప్పటికే ఈవో సాంబశివరావు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు.
 
సోమవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను చైర్మన్ వెల్లడించారు.న్యాయపరమైన చిక్కులు తొలగించి, తిరుపతిలో వకుళమాత ఆలయాన్ని కూడా నిర్మిస్తామన్నారు. సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు.  
 
ఆలయానికి అవసరమైన సరుకులు రూ.61.24 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ఆవునెయ్యి ట్యాంకర్ల ద్వారా కిలో రూ.276 చొప్పున రూ. 46.92 కోట్లతో 17 లక్షల కిలోలు, డబ్బాల ద్వారా కిలో రూ.278 చొప్పున రూ. 6.65 కోట్లతో 2.25 లక్షల కిలోలు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.  ఎండుద్రాక్ష కిలో రూ. 177.30 చొప్పున రూ. 3.54 కోట్లతో 2 లక్షల కిలోలు, తాండూరు రకం కందిపప్పు కిలో రూ.118 చొప్పున రూ. 4.13 కోట్లతో 3.5 లక్షల కిలోలు కొనుగోలు చే యనున్నారు.  తిరుమలలోని జలాశయాల నుంచి సరఫరా అయ్యే తాగునీటిని శుద్ధిచేసి, సరఫరా చేసేందుకు రెండేళ్లకు రూ. 4.3 కోట్ల టెండర్‌ను ఆమోదించారు. .