గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (11:31 IST)

సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాదంలో పురుగులు..! అక్కడే భక్తుల ఆందోళన.. గంటా సీరియస్

సింహాద్రి అప్పన్న ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో బతికిన పురుగులు దర్శనమిచ్చాయి. వీటినే భక్తులకు పంపిణీ చేసిన ఆలయ కమిటీ పురుగుల వ్యవహారాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేసింది. అయితే భక్తులు అక్కడే ధర్నా చేయడంతో ఇది కాస్త బహిర్గతమయ్యింది. ఈ సంఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గిరి ప్రదర్శన చేసుకుని స్వామిదర్శనం చేసుకున్న తరువాత లడ్డూ కౌంటర్‌లో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. ఆ లడ్డూలలో బతికి కదలాడుతున్న పురుగులు, వాటి గుడ్లు, బూజు కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. చాలా మంది భక్తులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. 
 
ఈ విషయం ఫిర్యాదు చేయడానికి ఆలయ ఈవో వద్దకు వెళ్ళితే ఆయన గుట్టుచప్పుడు కాకుండా వారిని కొండ దింపే ప్రయత్నాలు చేశారు. ఇలా చాలామంది భక్తులకు జరగడంతో అందరూ అక్కడే ధర్నాకు దిగారు. చివరకు విషయం మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలియడంతో ఆయన ఆలయ ఈవోపై సీరియస్ అయ్యారు. అనంతరం నాణ్యత ఉన్న ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.