శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:38 IST)

గణపతి దేవా...! నీ నిమజ్జనానికి నీళ్ళేవి..?

వర్షంలేదు. ఎక్కడా నీళ్ళు లేవు.. చెరువులు ఎండిపోయాయి. నా చవితెప్పుడో చప్పవయ్యా అంటూ గణపతి దేవుడు మాత్రం వచ్చేశారు. ఉత్సవాలు జరపమంటున్నారు. వినాయక చవితి మొదలయిపోతోంది. ఊరూర విగ్రహాలు తయారైపోతున్నాయి. అయితే ఎక్కడా చుక్క నీరు లేదు.  గణపతి దేవా నీటి కొరత రాకుండా చూసుకో తండ్రీ అంటూ ఆయనపై భారం వేసి భక్తులు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
రాష్ట్రంలో జలాశయాలు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. పెద్ద పెద్ద జలాశయాలే వెల్లకిలా పడ్డాయి. తుంగభద్ర జలాశయంలోకి వచ్చే నీటి ప్రవాహం రోజురోజుకూ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 75.1 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 4,885 క్యూసెక్కులకు మించి రావటం లేదు. కర్ణాటక, మనకూ కలిపి 8,100 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌ దగ్గర విడుదల చేస్తున్నారు.
 
అనంపురం జిల్లా సరిహద్దు దగ్గర 1,500 క్యూసెక్కుల నీరు అందుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే 14 టీఎంసీలకు మించి కోటా విడుదలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఇది కేవలం ఒక అనంతపురం జిల్లా పరిస్థితి మాత్రమే. అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చెరువుల్లో నీరు లేదు. 
 
విజయవాడ, విశాఖ పట్టణం వంటి నగరాలలో నదులు, సముద్రాలలో నీరు కలిపేస్తారేమోగానీ, మిగిలిన తిరుపతి, కడప, కర్నూల్, నెల్లూరు వంటి ప్రాంతాలలో నీటి కొరత ఎక్కువగానే ఉంది. కానీ వినాయక చవితి ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరిగిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం వంటి చోట్ల సాగునీటి కాలువలు ఉన్నప్పటికీ అక్కడ కూడా తగిన ఎత్తులో నీరు లేదు. ఫలితంగా పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫైరింజన్లతో తడిపి నిమజ్జనం చేసే పరిస్థితి ఏర్పడుతుందేమో..