గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2015 (11:58 IST)

తిరుమల శ్రీవారికి మొదటి కానుక ఎవరిచ్చారు? ఆ కానుక ఏమిటి?

తిరుమల శ్రీవారికి వద్దంటే కానుకలు వచ్చిపడుతున్నాయి. కాలిగోటి నుంచి జుట్టు వరకూ బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలతో నింపేశారు. ప్రపంచంలో ఏ దేవుడికి లేనన్ని కానుకలు ఆయనకు వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కరలేదు. వేల కోట్లు ఆస్తులు లెక్కలేనన్ని నగలు ఉన్నాయి. అసలు ఈ కానుకల సంస్కృతి ఎలా వచ్చింది..? మొదటి కానుక ఎవరిచ్చారు. 
 
తిరుమల వేంకటేశ్వర స్వామి వెలసి ఎన్నాళ్ళయ్యిందంటే చెప్పడం కష్టమే. కానీ స్వామికి భక్తులు ఇచ్చే కానుకులను మాత్రం లెక్కగట్టేందుకు కొన్ని శాసనాలు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన వస్తువులను తయారు చేస్తోంది. కానీ ఒకప్పుడు దాతలు ఇచ్చిన కానుకలే స్వామి సేవలకు వినియోగించేవారు. కైంకర్యాలు మొదలుకుని, ఆభరణాల వరకూ చాలా సామాగ్రి దాతలు ఇచ్చినవే కావడం విశేషం. 
 
ఈ కానుకలకు చరిత్ర ఉంది. ఇలా తొలికానుక ఇచ్చిన వారు పల్లవరాణి సమువాయిగా చెబుతున్నారు. సమువాయి స్వామికి పరమభక్తురాలు. ఆమె తరచూ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వారు. అలా అక్కడ స్వామి సేవకు కావలసిన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె కీ.శ.614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయానికి బహుకరించారు. ఆలయ అర్చకులు చెప్పిన పద్దతి ప్రకారం విగ్రహాన్ని తయారు చేయించారు. నేటీకి ఆ కానుక వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు అందుకుంటోంది. ఇదే స్వామికి అందిన తొలికానుక ఆలయ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. 
 
అదే సంవత్సరంలో ఆనంద నిలయ జీర్ణోద్ధరణ గావించబడింది. బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ నుంచి ఆరంభమయ్యాయని చెబుతారు. ఆ తరువాత తెలుగు పల్లవరాజులు విజయగండ,గోపాలదేవుడులు దానిని కొనసాగించాయి. కీ.శ.1473లో తిరుమల రాయమండపానికి వేదిక నిర్మించారు. తరువాత 1513 నుంచి 1523 వరకూ విజనగర సామ్రాజ్యదీశులు శ్రీకృష్ణదేవరాయులు ఏడుమార్లు వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు విచ్చేశారు. ఆయన ఎన్నో కానుకలను ఇచ్చారు. 
 
1530లో అచ్యుత రాయలు కొన్ని గ్రామాలను,భూములను స్వామి వారి కైంకర్యాలకు కానుకగా ఇచ్చారు. 16వ శాతాబ్దం చివరలో అన్నా ఊయల మండపాన్ని విస్తరింప జేశారు. ఇలా ఎందరో రాజులు, చక్రవర్తలు స్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఇటీవల కాలంలో గాలి జనార్థనరెడ్డి ఇచ్చిన వజ్రకిరీటం చెప్పుకోదగినదిగా చెప్పావచ్చు. ఇలా ఎన్నో కానుకలు స్వామిని చేరుతుంటాయి. అయితే తొలి కానుక ఇచ్చిన భాగ్యం మాత్రం వేంకటేశ్వర స్వామి భక్తురాలు పల్లవరాణి సమువాయికే దక్కింది.