గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 07
  4. »
  5. స్వాతంత్ర్య దినోత్సవం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

అలనాటి రాజకీయం...కులమతాలకు అతీతం

WD PhotoWD
స్వాతంత్ర్యం సాధించి 60 ఏళ్లుకావస్తున్నా మహిళలు మాత్రం బానిస సంకెళ్ల నుంచి బయటపడలేదంటున్నారు మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య. ఆమెతో వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్యూ....

ఆరేళ్ళ వయసులో బ్రిటిష్ సైనికులకు ఎదురు తిరిగి దేశ భక్తిని చాటిన ధీరోదాత్తురాలు ఆమె! స్వతంత్ర భారతంలో కులవివక్షపై కన్నెర్ర చేసిన విప్లవ నారి ఆమె!! ఇందిరా గాంధీ వంటి ఉక్కు మహిళ, పిలిచి పదవి ఇచ్చిన పరిణత రాజకీయవేత్త ఆమె!!!

అన్నింటికీ మించి, అన్నార్తులకు, అనాధలకూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకూ బాసటగా నిలచిన స్వచ్చంద సేవకురాలు ఆమె.

ఇంతటి ఘన చరితకు సజీవ సాక్ష్యం... చిరునవ్వు చెదరని అద్వీతీయ వ్యక్తిత్వం...చెన్నుపాటి విద్య సొంతం. మాజీ ఎంపీగా, సంఘ సేవకురాలిగా, నవయుగ సంఘ సంస్కర్త గోరా కుమార్తెగా మన్ననలు అందుకున్నా విద్యను 60 ఏళ్ల స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా `వెబ్‌దునియా తెలుగు` ఇంటర్య్వూ చేసింది. ఆ విశేషాలు మీకోసం.

వెబ్‌దునియా: స్వతంత్ర భారతావని స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ, నేడు పంద్రాగస్టు సంభరాలు జరుపుకుంటున్న తరుణంలో మీ ప్రతిస్పందన ఏమిటి?
విద్య: స్వాతంత్ర్య దినోత్సవం అంటేనే, నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఎందరో మహనుభవుల త్యాగఫలాన్ని మనం ఇపుడు అనుభవిస్తున్నాం. స్వతంత్ర భారతంలో మనం కొంత అభివృద్దిని సాధించగలిగాం. కాని అంతకు మించి అధోగతి పాలవుతున్నామేమో అనే భయం మాలాంటి వాళ్ళకు కలుగుతుంది. ఇప్పటి పిల్లలకు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర తెలియదు...ఇప్పటి నేతలకు క్రమశిక్షణ తెలియడంలేదు...ఇప్పటి వ్యవస్థకు ఈ స్వేచ్ఛా వాయువుల విలువ తెలియటం లేదు. ఇకనైనా ఈదుస్థితి నుంచి మనం బయటపడాలి.

వెబ్‌దునియా: మీ తరంలో పరిస్థితి ఎలా ఉండేది?
WD PhotoWD

విద్య: గోరా గారు.. అంటే మా నాన్నగారు స్వాతంత్య ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్న రోజులవి. క్విట్ ఇండియా మూమెంట్‌లో నాన్నాగారితోపాటు అమ్మని, అక్కని కూడా అరెస్టు చేశారు. ఇంట్లో విజయం, సమరం నేను మాత్రమే మిగిలాం. అప్పుడు మేం కృష్ణాజిల్లా ముదునూరులో ఓ పూరిపాకలో ఉండేవాళ్ళం. బ్రిటిష్ సైనికులు రెండుసార్లు మా ఇంటిపై దాడి చేశారు. గాంధీజీతో పాటు మా నాన్నగారిని మమ్మల్ని, అందరినీ తూలనాడారు.

ఆరేళ్ళ వయసులో ఉన్ననాకు కోపం తన్నుకొచ్చింది. అందుకు ప్రధాన కారణం.. మీకు కులం, జాతి, మతం లేదని, కులాల పేరుతో బ్రిటీష్ సైనికులు దుషించడమే. మా ఇంట్లో పుస్తకాలు, వస్తువులు వారు గిరాటువేశారు. తర్వాత మంచినీళ్ళు ఇవ్వండని గద్దించారు. "కులం, మతం లేనివారమని తిట్టారుగా, మాలాంటి వారి మంచినీళ్ళు మీరెలా తాగుతారు? నేనివ్వనని" తెగేసి చెప్పాను. చిన్న పిల్లలమైన మాపైనా తమ ప్రతాపం చూపాలని ఉద్యుక్తులైన బ్రిటిష్ సైనికులను, మన పోలిసులు వారించడంతో గండం తప్పింది. అప్పటి నుంచి నాలో దేశాభిమానం స్వాతంత్ర్య స్పూర్తి రగులుకుంది.

వెబ్‌దునియా: కులరహిత సమాజం కోసం మీరు... మీ కుటుంబం దశాబ్దలుగా కృషి చేస్తోంది కదా! దాని గురించి వివరిస్తారా?
విద్య: అవును. మా నాన్నగారు మా ఇంట్లో అందరి పేర్లు సమరం, విజయం, లవణం లాంటి భౌతిక వస్తువులవి పెట్టారు. ఆయన ఆశయాల అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం. 1974లో విజయవాడ తూర్పు నియోజక వర్గానికి నా అభ్యర్ధిత్వం ఖరారయింది. కానీ అప్లికేషన్‌లో కులం, మతం అనే కాలమ్‌లో నేను "నిల్" అని పెట్టడంతో కాంగ్రెస్ టికెట్టు రాలేదు.

దీనిపై ఆగ్రహించి, ఈ విషయాన్ని ఇందిరా గాంధీ దృష్టికి తీసుకెళుతూ ఓ లేఖ రాశా. "కులాలు, మతాలు అవసరం లేని రోజున, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా నా సేవలు కావాల్సినపుడు, నన్ను పిలవండి.. అంతవరకూ నేను ఏ పదవి కోసం, టిక్కేట్టు కోసం దరఖాస్తు చేయను" అని ఖరాఖండితంగా ఆమెకు వివరించాను. ఆ లేఖ ఇందిరాజీపై బలమైన ముద్ర వేసింది.

వెబ్‌దునియా: మరి 1979లో మీకు విజయవాడ ఎంపీ టికెట్టు ఎలా వచ్చింది?
విద్య: అదో ఆశ్చర్యకర పరిణామం. నేను నా మాటకు కట్టుబడి దరఖాస్తుకూడా పెట్టలేదు. ఓ రాత్రి అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. పి.వి.నరసింహరావు గారు మాట్లాడి, "విద్య నీతో మేడంగారు మాట్లాడతారట, లైన్‌లో ఉండండ"ని చెప్పి ఫోన్ ఇందిరా గాంధీగారికిచ్చారు. "విజయవాడ ఎంపీ టిక్కేట్ నీకు ఇచ్చాను విద్య... గెట్‌రెడీ" అని మేడం వాయిస్ వినేసరికి నా గుండె జల్లుమంది. "మేడం ఎంపీగా నేను ఫిట్ అవుతానా?" అని సందేహం వెలుబుచ్చాను.

"I think you are the best choice" అని ఇందిరా గాంధీ అన్నమాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అదే స్పూర్తితో నాకు గురుతుల్యులు, జనతా పార్టీ అభ్యర్థి స్వర్గీయ K.L రావ్‌పై లక్షపైచిలుకుల మెజారిటీతో గెలుపొందాను.
WD PhotoWD
వెబ్‌దునియా: ఇప్పటికీ అప్పటికీ నేతలు, రాజీకీయాల్లో మీరు గమనించిన తేడా?
విద్య: చాలాఉంది. అప్పట్లో రాజకీయాల్లో కులతత్వం, దిగజారుడుతనం నాకు ఎపుడూ కనిపించలేదు. కాని ఇప్పటి స్థితి చూస్తే ఎంతో బాధగా ఉంది. కులాలు, మతాలు పేరుపెట్టి తిట్టుకునే స్థాయికి నాయకులు దిగజారారు. ఇది స్వతంత్ర భారతానికి, దేశ భవిష్యత్తుకు దెబ్బ. సెక్యులర్ స్టేట్ అని రాజ్యంగంలో రాసుకున్న మనం సెక్యులర్ వ్యవస్థను ఇన్నేళ్ళు అయినా ఏర్పాటు చేసుకోలేకపోయాం. ముందుగా మనం దేశంలో కుల, మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అత్యవసర సమయమిది.

వెబ్‌దునియా: నేటి మహిళపై మీ అంతరంగం?
విద్య: మా రోజుల్లోకన్నా ఇప్పుడు మహిళల్లో విద్య, ఉద్యోగావకాశాలు పెరిగాయి. విద్యా, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్ బిల్లును నేను పార్లమెంటులో ఉండగానే ప్రవేశపెట్టడం జరిగింది. కాని ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలలో ఇంకా బానిస భావం పోలేదు. ఎంత ఉద్యోగం చేసినా... ఆ సంపాదన ఇంటికెళ్ళి భర్త చేతిలో పెడుతున్నారు....ఇక ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కడిది?

వెబ్‌దునియా: ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటున్నారా?
విద్య: ఇపుడిపుడే చాలా మంది ఆడవాళ్ళు తమంత తాము నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.... అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దీనికి తగ్గట్లే విడాకులూ పెరిగిపోవటం. అంటే దీని అర్థం, మగవారి మనస్తత్వంలో మార్పు రాలేదు. భార్యభర్తలు ఇద్దరూ సమానం అనే కాన్సెప్ట్ ఎప్పుడు బలపడుతుందో అప్పుడే స్త్రీ జీవితం, కుటుంబ వ్యవస్థ చక్కబడుతుంది.

వెబ్‌దునియా: ఇన్నేళ్ళ స్వతంత్ర భారతంలో మహిళలు ఇపుడు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఏంటి?
విద్య: మన దేశంలో ఇపుడు `ట్రాఫికింగ్` మహిళలకు పెద్ద సమస్యగా మారింది. ఎన్నడు లేని విష సంస్కృతి వచ్చేస్తోంది. ఆడపిల్లలను బలవంతంగానో, వారికి డబ్బు ఆశచూపో సైడ్‌ట్రాక్ చేస్తున్నారు. కొందరు యువతులు దీనిని easy moneyగా చూస్తూ, తప్పుదోవ పడుతున్నారు. వీటన్నిటికీ కుటుంబం, సమాజమే కారణం. ముఖ్యంగా తల్లిదండ్రులు పెంపకం లోపమే సమస్యలకు మూలం. నేనెంత రాజీకీయాలలో బిజీగా ఉన్నా, నా ముగ్గురు ఆడపిల్లలనూ ఏనాడు neglect చేయలేదు.
ఎన్నిరాచకార్యలున్నా...నాపిల్లలకు నేను ట్యూషన్ కూడా చెప్పేదాన్ని. మరిప్పటి తల్లులు ఎంత వరకూ పిల్లల బాధ్యతలు తీసుకుంటున్నారు? దేశ భవిత అంతా మహిళలపైనే ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. కాబట్టి తల్లులూ....దానిని వమ్ముచేయవద్దు.

వెబ్‌దునియా: మీ వాసవి మహిళా మండలి గురించి..
విద్య: మా నాన్నగారు `గోరా` ఆశయాలు, అభ్యుదయ భావలకు అనుగుణంగా `వాసవ్య`ను నడిపిస్తున్నాం.
వా - అంటే - వాస్తవికత!
స - అంటే - సంఘదృష్టి!!
వ్య - అంటే - వ్యక్తిత్వం!!!
ఈ మూడూ ముఖ్య గుణాలుగా మహిళలు, పిల్లలు సంక్షేమం కోసం పని చేస్తున్నాం. ఎయిడ్స్ బాధితులకు సుశ్రూష చేస్తున్నాం. 1969 నుంచి వాసవ్య మహిళా మండలి ద్వారా నేను చేస్తున్న కృషికి, సమాజానికి ఏ కొంత మేలు జరిగినా, అది స్వతంత్ర భారవతాని కీర్తిని ఇనుమడింపజేస్తుంది.

వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు ఇవే నా స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు.