శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (16:51 IST)

ఇంటికి మరింత అందాన్ని తెచ్చే "ఇండోర్‌ ప్లాంట్స్"!

స్వచ్ఛమైన గాలిని అందించే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే ఇంటికే సరికొత్త అందం రావడమే గాకుండా, ఆ గృహంలో మంచి ఆహ్లాదపూరిత వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఇంట్లో గుబురు మొక్కలు ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. స్వచ్ఛమైన గాలిని అందించటంలో వీటిదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 
 
గుబురు మొక్కలు 24 గంటల్లోనే గాలిలోని 87 శాతం కాలుష్యాన్ని తొలగిస్తాయి. ఇండోర్ ప్లాంట్స్‌‌లో పెంచే మొక్కలకు నేరుగా సూర్యరశ్మి కానీ, ప్రతి రోజూ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. అయితే చూసేందుకు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. ఇంటి డిజైనింగ్‌ను బట్టి, స్పేసింగ్‌ను బట్టి రకరకాల డిజైనర్‌ కుండీలలో మొక్కలను పెంచితే ఆ ఇల్లు పచ్చదనంతో కళకళ లాడుతుంది.
 
పామ్‌, పెరోమియా, మనీప్లాంట్‌ వంటి మొక్కలకు తక్కువ సూర్యరశ్మి సరిపోతుంది. పామ్‌ మొక్కను చిన్న కుండీలో నాటి, కావాల్సిన ఎత్తు పెరిగాక కత్తిరిస్తుండాలి. ఇక మనీప్లాంట్స్ బంగారు వర్ణం, ఆకుపచ్చ, ఫిలోడెండ్రాన్‌.. అనే మూడు రకాలు లభిస్తుంటాయి. వీటిలో ఏరకం అయినా తెచ్చి పెంచుకోవచ్చు. 
 
స్థలం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే వెడల్పాటి కుండీలో వేర్వేరు రకాలకు చెందిన ఐదారు మొక్కలను నాటుకోవడం మంచిది. మీరు మొక్కలు పెంచబోయే కుండీలలో రంగు రంగుల గోళీలు, చిన్న సైజు బొమ్మల వంటివి కూడా పెడితే చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే... మొక్కల్ని ఎప్పుడూ ఒకే చోట, ఒకే కోణంలో ఉంచకూడదు. 
 
ఒకటి, రెండు వారాలకోసారి వాటిని తిప్పుతూ ఉండాలి. కొన్ని ఇళ్లల్లో ఇండోర్ ప్లాంట్స్ ఆకులు రాలిపోతూ ఇంటి యజమానులకు తెగ చికాకును తెప్పిస్తాయి. మొక్కలకు నీరు ఎక్కువైనా.. తక్కువైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నీటి విషయంలో సమతుల్యం అవసరమని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.