శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2015 (09:47 IST)

లాహోర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన పాకిస్థాన్ 'గీత'.. డీఎన్ఏ టెస్టుల తర్వాతే అప్పగింత

పాకిస్థాన్ గీత తలరాత మారనుంది. 15 యేళ్ళ క్రితం రైలులో తప్పిపోయి పాకిస్థాన్‌కు చెందిన భారతీయ యువతి.. ఇపుడు తిరిగి స్వదేశానికి వస్తోంది. సోమవారం ఉదయం లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరింది. మధ్యాహ్నానికి హస్తినకు చేరుకోనుంది. 
 
చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరుకున్న చెవిటి, మూగ యువతి గీతకు కరాచీలోని ఈదీ ఫౌండేషన్ ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. గీతను భారత్‌కు రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 8 గంటలకు గీత పాకిస్థాన్‌లోని లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరింది. 
 
దీనిపై ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి ఫహద్ ఈదీ స్పందిస్తూ.. గీత వెంట నేను, మా తండ్రి ఫైసల్ ఈదీ, మా అమ్మ, మా నాన్నమ్మ బిల్‌ఖ్వాస్ ఈదీ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నాం అంటూ ఆదివారం కరాచీలో మీడియాకు చెప్పారు. 
 
ఇప్పటికే గీత బీహార్‌లో తన కుటుంబం ఉంటున్నట్టుగా ఫొటోల ఆధారంగా గుర్తించిందని, డీఎన్‌ఏ పరీక్షల్లో పాజిటివ్‌గా వస్తే ఆ కుటుంబానికి గీతను అప్పగిస్తామని భారత అధికారులు చెపుతున్నారు. ఒకవేళ పరీక్షలు నెగెటివ్‌గా వస్తే.. గీతకు ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించి, తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకుంటామని భారత హైకమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు.