శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (11:33 IST)

ముంబై దాడికి కర్త.. కర్మ... క్రియ.... నేనే : విచారణలో డేవిడ్ హెడ్లీ

ముంబై దాడిలో ప్రధాన పాత్ర పోషించింది తానేనని అమెరికా జైల్లో శిక్షను అనుభవిస్తున్నఈ కేసు నిందితుడైన అమెరికా - పాకిస్థాన్ దేశస్తుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించారు. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టు మంగళవారమైన రెండో రోజు కూడా విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను వెల్లడించారు. 
 
'2007లోనే ముంబైపై దాడికి లష్కరే తోయిబా నిర్ణయించింది. తాజ్ హోటల్ రెక్కీ బాధ్యతలు నాకు అప్పగించింది. 2003లోనే జైషే మహమ్మద్ అధినేత మనూద్ అజహర్‌ను నేను కలిశాను. అదే సమయంలో లఖ్వీ, మసూద్‌లను కూడా కలిశాను. వారందరి లక్ష్యం ఒకటే. భారత ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో భయాన్ని సృష్టించడం. అందుకు సగం పని నేనే చేశాను' అని తెలిపాడు. 
 
మరోవైపు... లష్కరే తాయిబా ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌ డేవిడ్‌ హెడ్లీ వెల్లడించిన సమాచారం ఆధారంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని భారత భావిస్తోంది. 26/11 దాడులకు లష్కరే ఉగ్రవాదులు హఫీజ్‌ సయ్యద్‌, జకీఉర్‌ రెహమాన్‌ లఖ్వీ కారకులని భారత వాదిస్తోంది. వారిద్దరినీ కోర్టు ముందు ఉంచి శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే భారత వాదనకు ఆధారాలు లేవంటూ పాకిస్థాన్‌ తోసిపుచ్చుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హెడ్లీ ముంబై కోర్టు ముందు వెల్లడించిన సమాచారం ఈ కేసులో కీలకంగా మారుతుందని హోం మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.