శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (15:28 IST)

అమెరికాలో భారీ భూకంపం : 6వేల కోట్ల ఆస్తి నష్టం.. రిక్టర్ స్కేలుపై 6గా..

అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. 
 
శాన్ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ఇలాంటి భారీ భూకంపం ఏర్పడలేదు. ఈ భూప్రకంపనలతో అనేక నివాసాలు నేలమట్టమయ్యాయి. డజన్ల కొద్దీ మంచినీళ్ల, గ్యాస్ ప్రధాన పైపులైన్లు ధ్వంసమయ్యాయి. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
 
నాపాలోని క్వీన్ ఆఫ్ ద వ్యాలీ మెడికల్ సెంటర్లోని ఎమర్జెన్సీ రూంలో దాదాపు 120 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
అయితే ఈ భూకంపం వల్ల కాలిఫోర్నియా ప్రాంతంలో కూడా భారీ నష్టం జరగాల్సి ఉన్నా.. అదృష్టవశాత్తు అది తప్పిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో 1906లో సంభవించిన భూకంపం ఆదివారం నాటి దానికన్నా 500 రెట్లు ఎక్కువని వారు చెబుతున్నారు.