శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (21:15 IST)

80 ఏళ్ల నేపాల్ చరిత్రలో అతిపెద్ద భూకంపం... 970 మంది మృతి... పెరిగే అవకాశం...

నేపాల్ 80 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద భారీ భూకంపం శనివారంనాడు చోటుచేసుకుంది. ఈ బీభత్సంలో ఇప్పటివరకూ 970 మంది మృతి చెందినట్లు తేలింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.

నేపాల్‌లో శనివారం వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాలన్నీ గంటన్నర వ్యవధిలో చోటు చేసుకున్నాయి. చివరంగా సంభవించిన మూడో భూకంప కేంద్రం కూడా నేపాల్‌లోనే ఉంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. కాగా, తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదు కాగా, రెండోది 6.5గా నమోదైనట్టు సమాచారం. 
 
మూడో భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మండుకు 83 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు యూరోపియన్ సెస్మోలాజికల్ సెంటర్ వివరించింది. నేపాల్‌లో పలు భవంతులు కుప్పకూలాయి. దీంతో ప్రాణనష్టం భారీ స్థాయిలోనే వుంది.
 
కాగా, నేపాల్ లోని పలు ప్రాంతాల్లో పాత భవంతులు కుప్పకూలగా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో పలువురు మృతి చెందారు. ఖాట్మండులోని ఆసుపత్రులకు వందలాది మంది క్షతగాత్రులు చేరుకుంటున్నారు. నేపాల్ లోని చాలా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ సేవలు నిలిచిపోగా, చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత పాత ఖాట్మండులోని హనుమాన్ డోక ప్రాంతంలో అధికంగా ఉంది. పలు ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాలు కుప్పకూలాయి.