శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (03:23 IST)

అమెరికా వెళ్లాలంటే విద్యార్థుల భయం.. షాక్‌లో అమెరికా విద్యాా సంస్థలు

జాతి విద్వేష దాడులు, ట్రంప్‌ కఠిన వలస విధానాల నేపథ్యంలో.. అమెరికా కాలేజీల్లో చేరే విదేశీ విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 40 శాతం కాలేజీలకు విదేశీ విద్యార్థుల దరఖాస్తులు తగ్గాయి. ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి భారీగా పడిపోయాయి.

జాతి విద్వేష దాడులు, ట్రంప్‌ కఠిన వలస విధానాల నేపథ్యంలో.. అమెరికా కాలేజీల్లో చేరే విదేశీ విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 40 శాతం కాలేజీలకు విదేశీ విద్యార్థుల దరఖాస్తులు తగ్గాయి. ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి  భారీగా పడిపోయాయి. కాలేజ్‌ బోర్డ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కొలీజియేట్‌ తదితర ఆరు సంస్థలు గత నెల 250 విద్యాసంస్థలపై నిర్వహించిన సర్వే ప్రకారం.. 
 
2017 సెప్టెంబర్‌లో మొదలయ్యే కోర్సుల అప్లికేషన్లను పరిశీలిస్తే ప్రతి 10 అమెరికా కాలేజీల్లో నాలిగింటికి ఈసారి తక్కువ వచ్చాయి. 40 శాతం కాలేజీలు, వర్సిటీలకు విదేశీ దరఖాస్తులు తగ్గగా, 35 శాతం సంస్థలకు పెరిగాయి. 26 శాతం సంస్థలకు గతంలో మాదిరే దరఖాస్తులు వచ్చాయి. 
 
26 శాతం సంస్థలకు భారత్‌ నుంచి అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు దరఖాస్తులు, 15 శాతం సంస్థలకు గ్రాడ్యుయేట్‌ అప్లికేషన్లు మందగించాయి. 25 శాతం సంస్థలకు చైనా నుంచి అండర్‌గ్రాడ్యుయేట్‌ దరఖాస్తులు పడిపోయాయి. 32 శాతం వర్సిటీలకు గ్రాడ్యుయేట్‌ కోర్సు అప్లికేషన్లు తగ్గాయి.
 
ఇటీవల చైనా, నేపాల్, భారత విద్యార్థులకు వీసాల నిరాకరణ కేసులు పెరగడం, అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లి రావాలంటే ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళనలు అమెరికాలో చదువుకోవాలనే ఆసియా యువకుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం సౌదీ విద్యార్థుల అనాసక్తికి కారణమని చెబుతున్నారు. 
 
ఇది హడావుడిగా చేసిన ఆన్‌లైన్‌ సర్వే. సమగ్ర అధ్యయనం ఫలితాలు మార్చి ఆఖరులో ప్రకటిస్తారు. అమెరికా వర్సిటీలు, కాలేజీల్లో చదవడానికి పెద్ద సంఖ్యలో చైనా, భారత్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా వంటి దేశాల యువత వెళ్లడం 16 ఏళ్లలో 72 శాతం పెరిగింది. 
 
తమ సంస్థలో చేరాలని ఆశిస్తున్న విద్యార్థులను ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి కలిసిన పోర్ట్‌లాండ్‌ స్టేట్‌ వర్సిటీ ప్రెసిడెంట్‌ విమ్‌ వ్యూవెల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అమెరికా రావడానికి భయపడుతున్నామని విద్యార్థులు చెప్పారు. అగ్రరాజ్యంలో ముస్లింలపై వ్యతిరేకత తన తండ్రికి గుబులు పుట్టిస్తోందని ఓ ముస్లిం విద్యార్థి చెప్పాడు. ‘అలాంటి భయాలు వద్దు’ అంటూ వ్యూవెల్‌ కౌన్సెలింగ్‌ చేయాల్సి వచ్చింది.