శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (15:49 IST)

పబ్లిక్ టాయ్‌లెట్‌‌లో పసిబిడ్డ జననం... వదిలేసిన కసాయి తల్లి...

అప్పుడే పుట్టిన పసిబిడ్డను పబ్లిక్ టాయ్‌లెట్‌లో వదిలేసి వెళ్లింది ఓ కసాయి తల్లి. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైనా దేశ రాజధాని నగరం బీజింగ్‌లో పుట్టి కొన్ని గంటలే అయిన పసి కందును గుర్తుతెలియని మహిళ పబ్లిక్ టాయ్‌లెట్‌లో వదిలేసి వెళ్లింది. ఆ పసి బిడ్డ ఏడుపు శబ్దం విన్న స్థానికులు లోపలికి వెళ్లి చూసి, దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఆ మహిళ బిడ్డను టాయ్‌లెట్‌లోనే ప్రసవించి, వదిలేసినట్లు తెలిసింది.
 
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఆ పసి బిడ్డను స్వాధీనం చేసుకుని శిశు సంక్షేమ సంఘానికి తరలించారు. చైనాలో ఒక బిడ్డను మాత్రమే కనాలనే చట్టం అమలులో ఉండడంతో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెండో సారి గర్భవతులయ్యే మహిళలు ఈ విధంగా పిల్లలను ప్రసవించి వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇదే విధంగా పెళ్లి కాకుండానే తల్లులు అయ్యే మహిళలు, కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా పుట్టిన బిడ్డలను అనాధగా వదిలే వెళుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ పసి బిడ్డ తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.