శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (14:39 IST)

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ మారణహోమం.. చిన్నారులను కాల్చి చంపిన సైన్యం?

పాకిస్థాన్ సైన్యం పైశాచికంగా ప్రవర్తిస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ వాసులను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వారిలో అలజడిరేకెత్తిస్తుందో.. ఆ విధంగానే తమ భూభాగంలో ఉన్న బలూచిస్థాన్‌లో కూడా తమ ఆగడాలను కొనసాగిస్తోంది. ఈ విషయం తాజాగా నిరూపితమైంది. ఒకే ప్రాంతంలో వంద చిన్నారుల కళేబరాలు బయటపడ్డాయి. ఇది బలూచిస్థాన్ వాసులను ఆగ్రహానికి లోనుచేసింది. ఈ చిన్నారులంతా తుపాకీ గుళ్ళకు బలైనట్టు తెలిపేలా తల కణితి భాగంలో తుపాకీ తూటా దూసుకెళ్లినట్టుగా ఓ రంధ్రం ఉండటమే నిదర్శనం. 
 
నిజానికి 1947 మార్చి నుంచి 1948 ఏప్రిల్ వరకు బలూచ్ స్వతంత్ర రాజ్యంగానే ఉండేది. అయితే, ఆ రాజ్యాన్ని భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్థాన్ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి బలూచిస్థాన్‌లో స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూ వస్తోంది. పాక్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని, వారి కుటుంబీకులను గుట్టుచప్పుడుకాకుండా ఆ దేశ సైన్యం హతమార్చుతోంది. 
 
ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చాయి. మీ రాక్షసపాలన మాకొద్దంటూ, బలూచ్ ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దురాగతాలకు అంతేలేకుండా పోతోంది. దీంతో, ఆ ప్రాంత ప్రజలు కూడా తమను భారతదేశంలో కలిపివేయాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.