గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (12:21 IST)

ఇసిస్ ఉగ్రవాదులకే షాకిచ్చి.. రూ.2 లక్షలు నొక్కేసిన చెచెన్యా యువతులు

ఇద్దరు చెచెన్యా యువతులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకే షాకిచ్చి.. వారి నుంచి ఏకంగా 2 లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో చెచెన్యా పోలీసులు ఆ ఇద్దరు యువతుల కోసం గాలిస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఇసిస్ తీవ్రవాదులు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెల్సిందే. అలాంటి నరరూప రాక్షసులకే చెచెన్యాకు చెందిన ఇద్దరు యువతులు తేరుకోలేని షాకిచ్చారు. 
 
నిజానికి ఇసిస్ సంస్థ చాలా మంది యువతీ యువకులకు వివిధ రకాలైన ఆఫర్లు ఇచ్చి.. ఉద్యోగాల్లో తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ రిక్రూట్మెంట్ అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. పైగా.. ఎక్కువగా ముస్లిం ప్రాంతాలపైనే ఇసిస్ సంస్థ దృష్టిసారించింది. 
 
ఈ క్రమంలో గురువారం ముగ్గురు యువతులు.. తాము ఐఎస్ సంస్థలో చేరుతామని ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. దానికి ఐఎస్ ఆన్‌లైన్ రిక్రూటర్స్ అంగీకరించారు. అయితే తమకు సిరియా వచ్చేందుకు అవసరమైన డబ్బులు లేవని, మీరు ఆ డబ్బు సర్దుబాటు చేస్తే వెంటనే వచ్చేస్తామని చెప్పారు. డబ్బు జమ చేసేందుకు ఓ నకిలీ బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చారు.
 
ఇది నిజమని నమ్మిన ఇసిస్ తీవ్రవాదులు.. తమ ప్రతినిధులతో ఆ ఖాతాలో 3,300 డాలర్లు (రూ.2,14,500/-) డిపాజిట్ చేశారు. ఆ డబ్బు తీసుకున్న ఆ యువతులు వెంటనే ఆ అకౌంట్‌ను క్లోజ్ చేసి.. మిన్నకుండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చెచెన్యా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.