శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:23 IST)

గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి నో: 'ఎయిర్‌బస్ ఏ-320' కూల్చేసిన కో-పైలట్ ఆండ్రియాస్!

ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్సా పర్వతాల్లో 'ఎయిర్‌బస్ ఏ-320' విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 150 మందిని జర్మనీ వింగ్స్ కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ పొట్టనబెట్టుకున్నాడు. ఇతని గురించి విచారణలో షాకింగ్ న్యూస్‌లు బయటపడుతున్నాయి. ఆండ్రియాస్ మానసిక రోగి అని, విమానాన్ని కూల్చేసిన రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కౌన్సెలింగ్ తీసుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక 'బిల్డ్' శుక్రవారం వెల్లడించింది. 
 
బాత్‌రూమ్‌కు వెళ్లిన పైలట్ను తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్‌ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న గర్ల్ ఫ్రెండ్, రెండు వారాల క్రితం అభిప్రాయ భేదాలొచ్చి తనతో విడిపోయిందని, అప్పటి నుంచి ఆయన మానసిక జబ్బు మళ్లీ తిరగతోడిందని, అందుకోసం సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని ఆ పత్రిక పేర్కొంది. తీవ్ర మనస్తాపంతో రగిలిపోతున్న టూబిడ్జ్ విమానాన్ని కూల్చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా శుక్రవారమే వెలుగులోకి వచ్చింది.
 
విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం గురువారం నాడు నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ఓ గర్ల్ ఫ్రెండ్‌తో వ్యవహారం ఉన్నట్టు, మానసిక వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ సందర్బంగా కొన్ని నెలలపాటు లూబిడ్జ్ సెలవుపై వెళ్లినట్టు ధ్రువీకరించిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ హెడ్ కార్‌స్టెన్ స్పార్..  అతడి మానసిక వ్యాధి విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెల్సింది. అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్గా ఎంపిక చేశామని కార్‌స్టెన్ స్పార్ తెలిపారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు.