గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:37 IST)

ఎలుకా... మజాకా..! వెళ్లిన దారిలోనే వెనక్కి వచ్చిన అంతర్జాతీయ విమానం..

ఓ ఎలుక అంత పెద్ద విమానాన్ని ఏం చేస్తుంది..? ఎలుక ప్రాణమెంత? విమానం బరువెంత? ఇలాంటి ఎలుకలు ఎన్ని దూరినా విమానంలో ఇంకా తావు ఉండనే ఉంటుంది. కానీ ఎలుక... విమానం నడిపే పైలట్లను కంగారెత్తించింది. నాలుగు గంటల పాటు ప్రయాణించిన ఓ అంతర్జాతీయ విమానాన్ని వెనక్కి రప్పించింది. ఎలుకే కదా..! వెళ్ళదామనుకుంటే ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందోనని భయంతో హడలెత్తిపోయారు. వెనక్కి తిరిగి వచ్చే వరకూ ప్రాణాలరచేతిలో పెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శుక్రవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-123 విమానం రెండు వందల మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ నుంచి మిలాన్‌కు బయలుదేరింది. రెండు గంటలు ప్రయాణించిన తర్వాత క్యాబిన్‌లో ఓ ఎలుక జాడ కనిపించింది. ఇక అక్కడి నుంచి పైలట్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. రైల్వే శాఖను హడలెత్తిస్తున్న ఎలుకలు విమానయాన శాఖను కూడా భయపెడతున్నాయనుకున్నారు. ఆ ఎలుక ఆ విమానంలోని వైర్లను కొరికేసిందంటే ఇక అంతే  ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. అందులో 200 మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. 
 
పోనీ అత్యవసరంగా కిందకు దించేద్దామంటే ఆ సమయంలో వారు ఉన్నది పాకిస్థాన్ గగన తలంలో. ముందుకు వెళ్దామంటే ఆ విమానం వెళ్తున్నది సుదీర్ఘ దూరంలో ఉన్న ఇటలీలోని మిలాన్‌కు. ఇక చేసేది లేక విమానం తిరిగి న్యూఢిల్లీ తిరిగొచ్చేసింది. 
 
ఆ ఎలుక ఉన్నదీ, లేనిదీ స్పష్టంగా కూడా తెలియదు. కేవలం ఎలుక ఉందేమో అన్న అనుమానంతోనే విమానాన్ని వెనక్కి తిప్పారు. కాగా, తాము ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ ఘటనపై తమ ఇంజనీరింగ్ బృందం దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.