గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr

కో పైలటే కొంప ముంచాడు.. విమానాన్ని కిందకు పరుగులు పెట్టించాడు.

జర్మన్ వింగ్స్ విమానాన్ని స్వయంగా నడుపుతున్న కో-పైలటే కూల్చేశాడని విశ్లేషకులు భావిస్తున్నాడు. పైలట్ కాక్ పిట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే విమానాన్ని భూమికి నిలువుగా వేగంగా దించడం మొదలు పెట్టాడు. పైలట్ ఎన్నిమార్లు బ్రతిమాలినా, తలుపు తట్టినా కాక్ పిట్ తలుపు తీయకుండా విమానాన్ని భూమి ఢీకొట్టించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం నుంచి బ్లాక్ బాక్సును బయటకు తీసిన డీకోడ్ చేసిన అధికారులకు దిమ్మె తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. 
 
జర్మనీ దేశపు జర్మన్‌వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానం.. గత మంగళవారం ఉదయం 10 గంటలకు స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి బయల్దేరి జర్మనీలోని డ్యుసెల్‌డార్ఫ్ నగరానికి పయనమవటం.. 40 నిమిషాల్లోనే ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో కూలిపోవటం తెలిసిందే. విమానంలోని ఆరుగురు సిబ్బందితో పాటు.. 144 మంది ప్రయాణికులు మొత్తం ఈ ఘోర దుర్ఘటనలో చనిపోయిన విషయమూ విదితమే. 
ఈ విమాన శకలాల నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించిన నిపుణులు.. విమానాన్ని కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశాడని బలంగా అనుమానిస్తున్నారు. విమానం బయల్దేరిన తర్వాత కాక్‌పిట్‌లో కెప్టెన్, కో-పైలట్‌ల మధ్య సంభాషణలు మామూలుగానే సాగాయి. ఎటువంటి ఆందోళనకరమైన అంశాలూ లేవు. చివరిగా.. విమానం నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత ఆ ఎత్తులో ప్రయాణం సాగిం చేందుకు లాంఛనంగా గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరటం నమోదయింది. 
 
ఆ తర్వాత కొద్ది నిమిషాలు ఎటువంటి సంభాషణలూ వినిపించలేదు. తరువాత కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లినట్లు తలుపుతీసిన శబ్ధం ద్వారా తెలుస్తోంది. తరువాత సెకనుల వ్యవధిలోనే ఆయన కాక్‌పిట్ వెలుపలి నుంచి తలుపుపై నెమ్మదిగా తడుతూ తెరవాలని కోరటం వినిపించింది. దీనికి కో-పైలట్ నుంచి ఎటువంటి స్పందనా, సమాధానం లేవు. తలుపు తెరవాల్సిందిగా కెప్టెన్ పదే పదే అడుగుతుండటం.. తలుపుపై చేతులతో కొడుతున్న శబ్దం వినిపించింది. 
 
కానీ.. కో-పైలట్ తలుపు తెరవలేదు. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ మామూలుగా శ్వాస తీసుకుంటున్న శబ్దం మినహా మరే శబ్దాలూ వినిపించలేదు. ఇక విమానం మరికొన్ని క్షణాల్లో కూలిపోతుందనగా ప్రయాణికులు హాహాకారాలు చేయటం నమోదయింది.
 
దీనినిబట్టి.. కాక్‌పిట్ నుంచి కెప్టెన్ బయటకు వెళ్లాక, తలుపు తెరుచుకోకుండా చేసి.. కో-పైలటే ఉద్దేశపూర్వకంగా.. విమానం నేరుగా నేలను తాకి కూలిపోయేలా నియంత్రణ వ్యవస్థను ఆపరేట్ చేశాడన్న నిర్ధారణకు వచ్చినట్లు ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కో-పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి కారణమేమిటనేది ఇంకా తెలియదన్నారు. అయితే.. ఇందులో ఉగ్రవాద పాత్రకు అవకాశం లేదని, అతడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవని కొట్టివేశారు.