గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (17:53 IST)

ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ తరంగాల్ని గుర్తించిన పరిశోధకులు: మోడీ ప్రశంసలు

వందేళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇన్నాళ్లు ఊహగా మాత్రమే ఉన్న గ్రావిటేషనల్ వేవ్స్‌ను శాస్త్రవేత్తలు గుర్తించడం ద్వారా భౌతిక, ఖగోళ శాస్త్రాల్లో అద్భుతమైన ఆవిష్కరణ జరిగిందని చెప్పవచ్చు.

వివరాల్లోకి వెళితే.. 130 కోట్ల ఏళ్ల క్రితం రెండు కృష్ణబిలాలు ఢీకొట్టుకోవడంతో కలిసిపోయిన రెండు భారీ ద్రవ్యరాశులు ముందుకు చలించి గత ఏడాది భూమికి చేరగా అత్యాధునిక పరికరాలతో వాటిని గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన సూక్ష్మ ప్రకంపనలను సైతం పసిగట్టేందుకు అమెరికాలో భూగర్భంలో అమర్చిన లేజర్‌ ఇంటర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌-వేవ్‌ అబ్జర్వేటరీ(ఎల్‌ఐజీవో-లిగో)గా వ్యవహరించే రెండు డిటెక్టర్లు వీటిని గుర్తించాయి.
 
అంతరిక్షం - కాలానికి సంబంధించిన ఈ తరంగాల్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ వందేళ్ల క్రితమే తన సాపేక్ష సిద్ధాంతంలో పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి 2015 సెప్టెంబరు 14న భూమికి చేరగా అత్యాధునిక లిగో పరికరాలతో గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు. 1916లో ఐన్‌స్టీన్‌ పేర్కొన్న మాదిరిగానే 2015లో తాము గమనించిన తరంగాలు ఉన్నట్లు మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు, లిగో బృందం నేత డేవిడ్‌ షూమేకర్‌ పేర్కొన్నారు. 
 
ఇది పిచ్చుక శబ్దంలా ఉందనీ, 20లేదా 30హెర్ట్జ్‌ల తక్కువ ఫ్రీక్వెన్సీతో ప్రారంభమై, క్షణకాలంలో 150 హెర్ట్జ్‌ల దాకా వెళ్లిందన్నారు. గురుత్వాకర్షక తరంగాలను గుర్తించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న భారతీయ శాస్త్రవేత్తల పాత్రను ప్రశంసించారు. ఈ సవాలులో భారతీయ శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర పోషించారని ట్విట్టర్ ద్వారా కొనియాడారు.