బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (10:50 IST)

రుణదాతల బెయిల్ ఔట్ ప్యాకేజీని తిరస్కరించిన గ్రీకు దేశస్థులు

అంతర్జాతీయ రుణదాతల బెయిల్ ఔట్ ప్యాకేజీని గ్రీకుదేశస్థులు తిరస్కరించారు. ఇదే అంశంపై ఆదివారం జరిగిన ఓటింగ్‌ ద్వారా తమ తీర్పును వెల్లడించారు. ఈ రెఫరెండంలో 61 శాతం మంది ఓటర్లు బెయిల్ ఔట్ ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటేశారు. ప్రభుత్వం కూడా బెయిల్ ఔట్‌ను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చి విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రధాని సిప్రాస్ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించిన ప్రజలు అంతర్జాతీయ రుణదాతల ఆంక్షలను తిప్పికొట్టారు.
 
దీంతో గ్రీస్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక విశ్లేషకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ అంతర్జాతీయ రుణదాతల ఆర్థిక ఆంక్షలకు కట్టుబడే ప్రసక్తే లేదని గ్రీస్ ప్రజలు ఈ ఓటింగ్ ద్వారా తేల్చిచెప్పారు. ఈ రెఫరెండంను గౌరవించి తీరతామని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. 
 
ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదని కూడా ఈయూ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ ప్రకటించిన ఉద్దీపన షరతులకు అంగీకరించని నేపథ్యంలో యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకురానుంది. గ్రీస్ నిష్క్రమణ ప్రభావంపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశంకానున్నాయి.