శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (05:56 IST)

ఉగ్రవాదులు కాదు.. అమెరికన్ ఉన్మాదులే రియల్ డేంజర్.. షాక్ కలిగిస్తున్న అసలు లెక్కలు

అంకెల కన్నా మించి వాస్తవాలను చెప్పే కొలమానం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు కదా. ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోనికి అడుగుపెట్టకుండా నిషేధం విధించడానికి కారణం ఉగ్రవాదుల దాడులను అరికట్టడమే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతడి అనుచర వర్గం ఎంత నిర్భీతిగా ప్ర

అంకెల కన్నా మించి వాస్తవాలను చెప్పే కొలమానం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు కదా. ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోనికి అడుగుపెట్టకుండా నిషేధం విధించడానికి కారణం ఉగ్రవాదుల దాడులను అరికట్టడమే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతడి అనుచర వర్గం ఎంత నిర్భీతిగా ప్రకటించినా అసలు వాస్తవాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. నిజంగా ట్రంప్ నిషేధం విధించిన సిరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, యెమెన్, సోమాలియా దేశాల నుంచే ఎక్కువ మంది ముస్లింలు అమెరికాకు వస్తున్నారా వారి వల్లనే టెర్రరిస్టు దాడుల ప్రభావం ఉందా అన్న అంశాలను పరిశీలిస్తే దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 
 
అమెరికా గడ్డపై గత 40 ఏళ్ల కాలంలో జరిగిన పలు టెర్రరిస్టు సంఘటనలతో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అరెస్ట్‌ అయినవారు లేదా శిక్షపడిన వారు ఈ ఏడు దేశాల నుంచి వలసవచ్చిన వారిలో 17 మంది మాత్రమే ఉన్నారు. పైగా వారి ప్రమేయమున్న టెర్రరిస్టు దాడుల్లో ఏ ఒక్కరు కూడా మరణించలేదు. విదేశాల నుంచి వచ్చిన టెర్రరిస్టు దాడుల్లో కంటే అమెరికాలో పుట్టి పెరిగిన ఉన్మాదుల కాల్పుల సంఘటనల్లోనే ప్రజలు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
విదేశీయుడి దాడిలో ప్రాణాలు పోయే ప్రమాదం 36 లక్షల మంది ప్రజల్లో ఒక్కరికి మాత్రమే  ఉందని క్యాటో ఇన్స్టిట్యూట్‌ వెల్లడించింది. అమెరికా వరల్డ్‌ ట్రేడ్‌ టవర్‌పై జరిగిన టెర్రరిస్టు దాడి అనంతరం అమెరికాలో ముస్లిం తీవ్రవాదుల వల్ల ఏడాదికి సరాసరి 9 మంది మరణిస్తుండగా, అమెరికా తుపాకీ సంస్కతి వల్ల 12,843 మంది, రోడ్డు ప్రమాదాల వల్ల 30వేల మంది మరణిస్తున్నారు. ఇక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు 20వేల మంది.
 
వాస్తవానికి అమెరికాకు వలసవస్తున్న కాందిశీకుల్లో ముస్లింలు పది శాతం కూడా లేరని, మొత్తం అమెరికా ప్రజల్లో  ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారు 33 లక్షల మంది మాత్రమేనని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన ఈ ఏడు ముస్లిం దేశాల నుంచి 2016 సంవత్సరంలో 36,722 మంది మాత్రమే వలసవచ్చారు. వారిలో అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు.
 
సిరియా నుంచి 12,587 మంది, ఇరాక్‌ నుంచి 9,880 మంది, సోమాలియా నుంచి 9,020 మంది, ఇరాన్‌ నుంచి 3,750 మంది, సూడాన్‌ నుంచి 1458 మంది, యెమెన్‌ నుంచి 26 మంది వలసరాగా, లిబియా నుంచి ఒక్కరు మాత్రమే వచ్చారు. 
 
ఇప్పుడు ప్రపంచం తేల్చుకోవలసింది ట్రంప్ భాష మాట్లాడాలా లేక ఆ కంపునుంచి ఎంత దూరం సాధ్యమైతే అంత దూరం వెళ్లిపోవాలా?