మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (07:25 IST)

హఫీజ్‌ సయీద్‌ను ఇంటి జైల్లో పెట్టారు.. పేరు మార్చుకున్నాడు, షరామామూలే

పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ నెలకొల్పిన ఉగ్రసంస్థ నిషేధానికి గురైన జమాత్ ఉద్ దవా పేరు మార్చేసుకుంది. ప్రభుత్వం నుంచో, అంతర్జాతీయ సంస్థల నుంచో, అమెరికా నుంచో కాస్త ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సంస్థ పేరు మార్చి యధాప్రకారం ఉగ్రవాద కార్యక్రమాల

పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ నెలకొల్పిన ఉగ్రసంస్థ నిషేధానికి గురైన జమాత్ ఉద్ దవా పేరు మార్చేసుకుంది. ప్రభుత్వం నుంచో, అంతర్జాతీయ సంస్థల నుంచో, అమెరికా నుంచో కాస్త ఒత్తిడి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సంస్థ పేరు మార్చి యధాప్రకారం ఉగ్రవాద కార్యక్రమాలను కొనసాగించే హఫీజ్ సంస్థ కొత్త పేరు తహ్రీక్ అజాదీ జమ్ము అండ్ కాశ్మీర్. కశ్మీర్ పోరాటానికి కరెక్టుగా సరిపోయే పేరు పెట్టిన హఫీజ్ అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఇటు అమెరికన్ పెద్దన్నకు, అటు భారత్‌కి కూడా  పెద్ద జలక్ ఇచ్చి కూర్చున్నాడు. మొండివాడు జగమొండి అని పెద్దలు ఊరికే అన్నారా మరి. ఆ పదం హఫీజ్‌కి సరిగ్గా సరిపోతుంది.
 
పేరు మార్చడమే కాదు. ఫిబ్రవరి 5న పాకిస్తాన్‌లో కశ్మీర్ డే సందర్భంగా కశ్మీర్‌లో జిహాద్‌కు సపోర్టుగా ఈ కొత్త సంస్థ తహ్రీక్ అజాదీ జమ్ము అండ్ కాశ్మీర్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జమాత్ ఉద్ దవాను నిషేధించి, హఫీజ్‌ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచినా తాము చేసేది చేస్తాం ఏ పీక్కుంటావు పీక్కో అంటూ కొత్త సంస్థ సవాలు విసిరింది. అసలుకు హఫీజ్ అరెస్టు ఉదంతం కూడా పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నాటకంలో భాగమేనా అనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. 
 
పాకిస్తాన్‌లో ఏ సంస్థనయినా నిషేధిస్తే వెంటనే మరొక పేరు పెట్టుకుని కార్యకలాపాలు సాగించడం అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య.  అలాంటి సంస్థలను అరికట్టే ప్రయత్నాలకు ఆ దేశ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించకపోవడమే వింతల్లో కెల్లా వింత. హఫీజ్ సంస్థకు పాక్ సైన్యం, ఐఎస్ఐ రెండూ మద్దతుగా ఉండటంతో ఇక దానికి పట్టపగ్గాలు లేవని తెలిసిందే. తాజా పరిణామాలతో హఫీజ్ సయాద్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం తీసుకున్న చర్య కంటి తుడుపు చర్యే అనే అనుమానాలు ప్రబలుతున్నాయి.
 
ఈ వార్త బయటకు రాగానే పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైన్యం హఫీజ్ కొత్త సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్లి అక్షింతలు వేసి శుభాశీస్సులు కూడా చెప్పి వచ్చి ఉంటారని నెటిజన్లు జోకులు మీద జోకులేయడం గమనార్హం.