శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (12:24 IST)

గొర్రె మాంసం అనుకొని ఆవు మాంసం తిన్న ఎన్నారై.. పాప పరిహారం కోసం...

భారతదేశంలో ఉన్న పెద్ద మనుషులే... పెద్ద కూర పండుగలనీ... ఇంకోటనీ ఆవు మాంసాన్ని తెగ తినేస్తుంటే... పాపం.. న్యూజిలాండ్‌లోని ఒక ఎన్నారై మాత్రం తనకు గొర్రె మాంసం పేరిట ఆవు మాంసాన్ని విక్రయించారనీ, తన పాప పరిహారం ఖర్చులన్నింటినీ సూపర్ మార్కెట్‌ యాజమాన్యమే భరించాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నాడు.
 
వివరాలలోకి వెళ్తే... న్యూజిల్యాండ్‌లో నివసిస్తున్న జస్వీందర్ పాల్ కౌంట్‌డౌన్ సూపర్‌మార్కెట్‌లో గతేడాది సెప్టెంబరులో మాంసాన్ని కొన్నాడు. ప్యాకెట్‌పై గొర్రె మాంసం అని ఉన్నప్పటికీ.. ఇంటికెళ్లి వండుకుని తినే వరకు తాను తిన్నది ఆవు మాంసం అని జస్వీందర్‌కు తెలియలేదు. తీరా తాను తిన్నది ఆవు మాంసం అని తెలిసాక హిందూ మత ఆచారాలకు అపచారం చేసానంటూ తీవ్ర ఆవేదన చెందాడు. 
 
వెంటనే భారతదేశానికి వెళ్లి తాను చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోవాలని, తన పర్యటన ఖర్చు మొత్తం సూపర్‌మార్కెట్ యాజమాన్యమే భరించాలంటూ డిమాండ్ చేశాడు. అయితే, దీనిపై స్పందించిన సూపర్‌మార్కెట్ యాజమాన్యం తప్పు ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేసామని, పాల్‌కు జరిగిన ఇబ్బందికి విచారిస్తున్నామని సమాధానమిస్తూ అతనికి రెండు వందల డాలర్లు విలువ చేసే గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తున్నట్టు ప్రకటించింది. 
 
జస్వీందర్ మాత్రం తనకు ఎటువంటి గిఫ్ట్ ఓచర్లు అవసరం లేదనీ, ప్రక్షాళన ఖర్చును సూపర్‌మార్కెట్ భరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి తన ఇంట్లో వాళ్లు కూడా తనతో మాట్లాడడం ఆపేసారని చెప్తున్న జస్వీందర్ హిందూ సంప్రదాయం ప్రకారం ఆవు మాంసం తినడం పాపమనీ, తన పాపం పోవాలంటే భారత్ వెళ్లి ఆరు వారాల పాటు వివిధ పూజలు జరిపించాలని చెప్తున్నాడు.