శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 మే 2016 (13:56 IST)

ఆస్ట్రేలియాలో తెలుగమ్మాయి ఆత్మహత్య: డెడ్ బాడీతో ఎయిర్ పోర్ట్ వరకు వచ్చిన భర్త పరార్!

ఆస్ట్రేలియాలో ఉదయం నాన్నతో మాట్లాడింది.. మధ్యాహ్నానికల్లా ఆత్మహత్య చేసుకున్న తెలుగమ్మాయి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియాలో తెలుగమ్మాయి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన నార్ల సుబ్రహ్మణ్యం కుమారుడు మహంత్‌తో పూర్ణచందర్రావు కుమార్తె రమ్యకృష్ణకు 2014లో వివాహం జరిగింది.

ఆస్ట్రేలియాలో వ్యాపారం చేసే మహంత్ భార్యను మొదట్లో బాగానే చూసుకున్నాడు. కానీ గత ఏడాది నుంచి కట్నం కోసం వేధింపులు మొదలెట్టాడు. దీనికి తోడు మహంత్ తల్లి రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో రమ్యకృష్ణకు అత్త, భర్తల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మే 17వ తేదీన రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకుందని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆస్ట్రేలియాలో రమ్య పేరిట రూ.2.5 కోట్ల బీమా ఉందని, డబ్బు కోసమే అల్లుడు మహంత్ తన కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడని రమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా అనేక అనుమానాలతో ఆస్ట్రేలియాకు వెళ్లిన వారు రమ్య మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. శుక్రవారం రాత్రి రమ్య బంధువులు, భర్త మహంత్‌ కలిసి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో మృతదేహాన్ని అప్పగించిన వెంటనే మహంత్‌.. రమ్య పాస్‌పోర్టు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మహత్‌పై అనుమానాలు బలమైనాయి. 17వ తేదీన ఉదయం రమ్య తన తల్లిదండ్రులతో మాట్లాడిందని.. అదే రోజు మధ్యాహ్నానికి రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిందని.. ఉదయం ఫోన్‌ మాట్లాడిన తమ కూతురు మధ్యాహ్నం ఎలా చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.