శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (02:10 IST)

భూమ్మీద అతిపెద్ద ఉపాధి కల్పనా కర్తను నేనే.. నేనే.. అంటున్న ట్రంప్

భూమ్మీద దేవుడు ఇంతవరకు సృష్టించనంత అత్యధిక ఉద్యోగాల కల్పనా కర్తగా చరిత్ర సృష్టిస్తానని అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన రిపబ్లికన్ అభ్య్రర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించేవాడిగా చరిత్రలో మిగిలిపోతానని డొనాల్ట్ ట్రంప్

భూమ్మీద దేవుడు ఇంతవరకు సృష్టించనంత అత్యధిక ఉద్యోగాల కల్పనా కర్తగా చరిత్ర సృష్టిస్తానని అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన రిపబ్లికన్ అభ్య్రర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 70 సంవత్సరాల బిలియనీర్, అమెరికా 45వ అధ్యక్షుడుగా ఎంపికైన ట్రంప్ గత ఆరునెలల్లో తొలిసారిగా నిర్వహించిన ప్రెస్ కాన్పరెన్సులో పాల్గొన్నారు. పత్రికా స్వాతంత్ర్యానికి అత్యంత విలువ ఇస్తానని ప్రకటించిన ట్రంప్ న్యూస్ కాన్ఫరెన్సుల వల్లే తాను రిపబ్లకన్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ గెల్చుకున్నానని చెణుకులేశారు. 
 
దేవుడు మున్నెన్నడూ సృష్టించని రీతిలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పించేవాడిగా చరిత్రలో మిగిలిపోతానని డొనాల్ట్ ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికా మందుల కంపెనీలకు కొత్త బిడ్డింగ్ ప్రక్రియను రూపొందించాల్సి ఉందని, ఆ విధంగా అతి తక్కువ సమయంలోనే అత్యధిక డబ్బును ఆదా చేసినవారమవుతామని ట్రంప్ తెలిపారు. 
 
అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం సొంత ప్రయోజనాలకోసం పాటుపడనని డొనాల్డ్ ట్రంప్ శపథం చేశారు. గత వారంలో తన మిత్రుడైన దుబాయ్ డెవలపర్ 2 బిలియన్ డాలర్లను ఆఫర్ చేయగా తిరస్కరించానని, సొంత ప్రయోజనాలను దరిచేరనీయనని ట్రంప్ స్పష్టం చేశారు. నా ఇద్దరు కుమారులు డాన్, ఎరిక్ కంపెనీ వ్యవహారాలకు పరిమితం అవుతారని, వారు ఇకపై వాణిజ్య పరంగా నాతో చర్చలు జరపరని చెప్పారు. 
 
అదే సమయంలో అమెరికన్ల ఉద్యోగాలను ఫణంగా పెట్టే విధానాలకు మంగళం పలుకుతానని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే క్యారియర్ సంస్థతో సంప్రదించి వెయ్యి అమెరికన్ ఉద్యోగాలను కాపాడానని చెప్పారు. ఒకవేళ మీరు మెక్సికోకు మీ కర్మాగారాన్ని తరలించాలనుకుంటే మిచిగాన్‌లో ఉన్న మీ ప్లాంట్‌ను మూసివేసి ఆపని చేయాలని చెప్పారు. అమెరికా లోపల ఒకచోటినుంచి మరోచోటికి తరలిపోతే పెద్దగా పట్టించుకోనని ట్రంప్ తెగేసి చెప్పారు. సరిహద్దులకు అవతల నుంచి వ్యాపారం చేయాలనుకుంటే భారీపన్నులు విధించడం ఖాయమన్నారు. 
 
అదేసమయంలో ఒబామా కేర్ అనే పేరుతో డెమాక్రాట్లు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను స్వంతం చేసుకోనని, దాన్ని కచ్చితంగా రద్దు చేసి కొత్త ఆరోగ్య వ్యవస్థను మొదలెడతానని ట్రంప్ తేల్చి చెప్పారు  ఇకపై ఒబామా కేర్ కేవలం డెమాక్రాట్ల సమస్యగా మాత్రమే ఉంటుందని దాన్ని అరలో పెట్టి మూసేస్తామని స్పష్టం చేశారు.