మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (01:02 IST)

రిపబ్లికన్ల చేతుల్లోనే ట్రంప్ దిగిపోవడం ఖాయం..!

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు వారాల పాలనతోనే.. అమెరికానే కాదు.. ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ట్రంప్‌ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని.. దేశంలో మూడో వంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు వారాల పాలనతోనే.. అమెరికానే కాదు.. ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే ట్రంప్‌ ప్రజల్లో మెజారిటీ విశ్వాసం కోల్పోయారని.. దేశంలో మూడో వంతు మందికన్నా ఎక్కువ మందే అధ్యక్షుడిని అభిశంసించాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగబోరని.. మధ్యలోనే సొంత రిపబ్లికన్‌ పార్టీయే ఆయనను బలవంతంగా సాగనంపాలని వ్యూహం రచిస్తోందని అంతర్గత విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
 
‘ట్రంప్‌ను అభిశంసించాలి’ అనే ఉద్యమం అమెరికాలో బలపడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇందుకోసం సంతకాలు, విరాళాల సేకరణ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను అభిశంసించగల అంశాలేవి అన్నది ఆసక్తిగా మారింది. ‘అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించదగ్గ అంశాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ.. ఆయన తమకు భారమని రిపబ్లికన్లు ఎప్పుడు నిర్ణయించుకుంటారనేదే ప్రశ్న’ అని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
కోర్టులతో ట్రంప్‌ పోరాటం కూడా అభిశంసన దిశగా దారితీయవచ్చు. అమెరికాలోకి శరణార్థులు, ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యాయమూర్తి జేమ్స్‌ రాబర్ట్‌ ఉత్తర్వును సమర్థిస్తూ 9వ సర్క్యూట్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వేగంగా సమీక్షించవచ్చు. ట్రంప్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లయితే.. కోర్టును ధిక్కరించడానికి ఆయన ప్రయత్నిస్తారా?  అలా చేస్తే అది అభిశంసించగల మొదటి తరగతి నేరమవుతుంది.
 
ట్రంప్‌ వ్యక్తిగత ప్రయోజనాలు, అధ్యక్షుడిగా అధికారిక విధులు రాజీపడటం. ట్రంప్‌కు రష్యాలో విస్తృత వాణిజ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఆయన ‘సత్సంబంధాలు’ ఈ కోవలోకి రావచ్చు. అలాగే.. పలు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్న దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు కూడా ఇందులోకి వస్తాయి. ఇది ట్రంప్‌ను అభిసంసించగల రెండో రకం నేరం..
 
గత ఆదివారం ట్రంప్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పుతిన్‌ మీద మాట పడకుండా సమర్థించుకొచ్చారు. ‘పుతిన్‌ ఒక హంతకుడు’ అని టీవీ వ్యాఖ్యాత అభివర్ణిస్తే.. ‘మనకు చాలా మంది హంతకులు ఉన్నారు. మన దేశం చాలా అమాయకమైనదని మీరు అనుకుంటున్నారా’ అని ట్రంప్‌ ఎదురు ప్రశ్నించారు. ఇలా దేశాధ్యక్షుడే తన దేశమైన అమెరికాను కించపరచడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంపాదకుడు బ్రెట్‌ స్టీఫెన్స్‌ వ్యాఖ్యానించారు. పుతిన్‌కి అనుకూలంగా ప్రవర్తించడాన్ని ట్రంప్‌ కొనసాగిస్తే అభిశంసన ఇంకా ముందుకు జరగొచ్చు.
 
ట్రంప్‍ను సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీనే ఇంటికి సాగనంపే అవకాశాలు ఎక్కువని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. గ్యాస్‌, చమురు, వాల్‌ స్ట్రీట్‌లపై నియంత్రణల తొలగింపు, పన్నుల కోతలు, పాఠశాలల ప్రైవేటీకరణ, కార్మిక రక్షణ కుదింపు, సుప్రీంకోర్టులో కనీసం ఒక మితవాద న్యాయమూర్తి నియామకం వంటి పనులను పూర్తిచేసే వరకూ ట్రంప్‌ను రిపబ్లికన్లు భరిస్తారు. కొంత కాలానికి ట్రంప్‌ ఒక వైపరీత్యమని, పార్టీకి ప్రమాదకరమని, 2018 ఎన్నికలకు నష్టదాయకుడని రిపబ్లికన్‌ పార్టీ నాయకత్వం నిర్ధారణకు వస్తుంది. దీంతో ఆయనను వదిలించుకుని, ఉపాధ్యక్షుడు పెన్స్ ను అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయిస్తారు. ఈ వ్యూహాన్ని రిపబ్లికన్‌ పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు ఇప్పటికే చర్చిస్తున్నారు.
 
ట్రంప్‌ను సాగనంపేందుకు సొంత రిపబ్లికన్‌ పార్టీలోనే వ్యూహరచన విజయవంతమైతే, 2018లో కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందే ట్రంప్‌కు పదవీచ్యుతి ఖాయమని అమెరికా వ్యవహారాల నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఏదేమైనా ట్రంప్‌ను ఒకందుకు మెచ్చుకోవలసిందే. తనకేమైనా సరే అనుకున్నది చేసి తీరుతానని ధిక్కరిస్తున్న ఆధునిక మేరు నగధీరుడు ప్రంపంచం మొత్తం మీద ట్రంప్ ఒక్కరే మరి.