గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (16:52 IST)

యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం మూసివేత!

యెమెన్‌లో భారత రాయబార కార్యాలయం మూసివేశారు. యెమెన్‌ దేశంతో పాటు.. ఆ దేశ రాజధాని సనా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. దీంతో, పలు దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి తరలించాయి. భారత్ కూడా యెమెన్ నుంచి వేలాది మందిని స్వదేశానికి రప్పించింది. 
 
తాజాగా, యెమెన్‌లోని భారత ఎంబసీని దిజ్బౌటీకి తరలించారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ నెల 15న ఎంబసీని తరలించామని చెప్పారు. యెమెన్ రాజధాని సనాలో భద్రత మరీ దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యెమెన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు దిజ్బౌటీ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తామని వివరించారు.
 
ఇక, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు గురించి చెబుతూ... తాము 4,741 మంది భారతీయులతో పాటు, 48 దేశాలకు చెందిన 1,947 మంది విదేశీయులను కూడా సురక్షితంగా యెమెన్ నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో తాము తరలింపు ప్రక్రియ చేపట్టామని అన్నారు.