శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (06:34 IST)

పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నప్పడూ భారత్, చైనాలపై అక్కసు వీడని ట్రంప్

భూతాపానికి వ్యతిరేకంగా కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి కారణం అది అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదువల్లే అని తేల్చి చెప్పారు. ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ఒప్పందాన్ని అంగీకరించ

అమెరికా బాగుపడాలే కానీ ఇతర దేశాలు కాదని మొదటినుంచి ప్రకటిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పారిస్ ఒప్పందంనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్న సమయంలోనూ అదే విషయాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించేశారు. భూతాపానికి వ్యతిరేకంగా కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి కారణం అది అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదువల్లే అని తేల్చి చెప్పారు. ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ఒప్పందాన్ని అంగీకరించేందుకు మనసు అంగీకరించడం లేదని అందుకే వైదొలుగుతున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా ఒప్పందం ఉంటే అంగీకరించేందుకు సిద్ధమని ట్రంప్‌ పరోక్షంగా తేల్చి చెప్పారు. 
 
పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలపై కొన్ని దేశాలు అర్థం లేని షరతులు విధించాయని ట్రంప్‌ తప్పుపట్టారు. ‘పారిస్‌ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉండేందుకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌ బిలియన్ల కొద్దీ డాలర్లను అందుకుంటోంది. అమెరికాపై ఆర్థికంగా పైచేయి సాధించేందుకు... చైనా, భారత్‌లు వచ్చే కొన్నేళ్లలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్ని రెండింతలు చేయనున్నాయి. అమెరికా ప్రజలపై కఠినమైన ఆర్థిక ఆంక్షల్ని విధించడమే కాకుండా.. అమెరికా పర్యావరణ లక్ష్యాలకు తగినట్లుగా పారిస్‌ ఒప్పందం లేద’ని ట్రంప్‌ పేర్కొన్నారు. 
 
ఈ ఒప్పందం ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని ఇష్టమొచ్చినట్లు విడుదల చేయవచ్చని, వారికి మినహాయింపునిచ్చి.. అమెరికాకు ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. ‘ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. చివరిగా చెప్పేదేంటంటే పారిస్‌ ఒప్పందం అన్యాయంగా ఉంది. అందుకే తప్పుకుంటున్నాం’ అని ముక్తాయింపునిచ్చారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అమెరికా సార్వభౌమాధికారాన్ని బలహీనపరుస్తుంది. ఆమోదయోగ్యం గానీ నిబంధనల్ని మనపై విధించారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు నష్టం కలిగించే దేశంగా మనల్ని చిత్రీకరించార’ని పేర్కొంటూ పారిస్‌ ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
 
ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాలు, కంపెనీల ప్రతినిధులు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ఒక ప్రణాళికను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. 30 మంది మేయర్లు, ముగ్గురు గవర్నర్లు, 80 మందికిపైగా వర్సిటీ అధ్యక్షులు, 100కు పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులు కూటమిగా ఏర్పడి ఐరాసతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని ఆయన కుమార్తె ఇవాంకా కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.