శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (03:07 IST)

అటు ట్రంప్‌నీ ఇటు మోదీని ఇద్దరినీ ఏకిపడేసిన 'ది ఎకనమిస్ట్'

ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రాలను గత 50 ఏళ్లుగా తన భుజాలపై పెట్టుకుని మోసిన సుప్రసిద్ధ పత్రిక ది ఎకనమిస్ట్ ఎన్నడూ లేనివిధంగా అమెరికా నూతన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని తీవ్రంగా ఖండిస్తూ ముందుకొచ్చింది. పనిలో పనిగా దేశభక్తి పేరుతో ఉన్మాదాన్ని రగిలిస్

ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రాలను గత 50 ఏళ్లుగా తన భుజాలపై పెట్టుకుని మోసిన సుప్రసిద్ధ పత్రిక ది ఎకనమిస్ట్ ఎన్నడూ లేనివిధంగా అమెరికా నూతన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని తీవ్రంగా ఖండిస్తూ ముందుకొచ్చింది. పనిలో పనిగా దేశభక్తి పేరుతో ఉన్మాదాన్ని రగిలిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా అదే చేత్తోనే ఆ పత్రిక జాడించి వేసింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యతిరేకంగా శతాబ్దిన్నర క్రితమే పోరాడిన అమెరికా ఘన చరిత్రకు తూట్లు పొడుస్తూ నయా వర్ణ వివక్షను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని కంకణం కట్టుకున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఈ పత్రిక చీల్చి చెండాడింది. అదేంటో ఆ పత్రిక మాటల్లోనే చూద్దాం.
 
‘వర్తమాన ప్రపంచ రాజకీయాలు విషపూరితమైన తరుణంలో అమెరికా రేపు దారిద్య్రం వైపు ప్రయాణించబోతున్నది. ఆ మోతాదులోనే దాని క్రోధం కూడా పెరిగిపోతుంది. ఈ పరిణామంతో అమెరికా 50వ అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజా వ్యతిరేకత, శత్రుత్వం అనే విష చక్రబంధంలో ఇరుక్కు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దేశానికి అధ్యక్షునిగా ఎన్నిక కాబోతూ ట్రంప్‌ తనకు తానై సృష్టించుకున్న నిగూఢమైన చీకటి వలయం నుంచి తక్షణం బయటపడడానికి ఇంకా సమయం మించిపోలేదు. తన దేశ ప్రయోజనాల కోసం, ప్రపంచ ప్రజల క్షేమం కోసం ఆయన తక్షణమే ఒక ధర్మాన్ని ఆశ్రయించక తప్పదు. తనకు ముందు అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన దేశాధినేతలు పాటించి ప్రతిష్టించిన దేశభక్తినీ, సన్మార్గంలో నడిపించగల బోధనలనూ ట్రంప్‌ ఆచరించడం శ్రేయస్కరం.’ – ది ఎకనమిస్ట్‌ హెచ్చరిక, 19–11–2016
 
వర్ణ వివక్షను వ్యతిరేకించే వర్గం వైపు నిలిచి, అమెరికా అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్న మహనీయుడు అబ్రహాం లింకన్‌. అణగారిపోతున్న వర్గం కోసం విమోచన పోరాటాన్ని నడిపిన లింకన్‌ నాటి అమెరికా ఎక్కడ? జాతి వివక్షే రాజ్యధర్మమన్నట్టు బాహాటంగా చెబుతున్న ఈ 50వ అధ్యక్షుడి నేతృత్వంలోని అమెరికా ఎక్కడ? ఇది గమనించిన మీదటే ‘ది ఎకనమిస్ట్‌’ సరైన సమయంలో అలాంటి హెచ్చరిక చేయవలసి వచ్చింది.  
 
కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల సభలలోను, తరువాత కూడా నిప్పులు తొక్కుతూ అసంఖ్యాకంగా వివాదాస్పద ప్రకటనలు చేశారు. ‘జాతీయత’కూ, వర్ణ వివక్షతో కూడిన జాతీయతకు మధ్య తేడా తెలియని మౌఢ్యం ట్రంప్‌ మాటలలో గూడు కట్టుకుని ఉంది.
 
చిత్రమేమిటంటే,  ఆ హెచ్చరిక మధ్యనే మన ప్రధాని మోదీ ప్రస్తావన కూడా ఉంది. మోదీకి ట్రంప్‌తో ఉన్న ఒక పోలికను పేర్కొనడం విశేషం ‘దేశాభి మానం పేరుతో జాతి వివక్షను, అసహిష్ణతను బోధించే హిందూత్వ గుంపులతో మోదీకి సంబంధాలు ఉన్నాయ’ని ‘ది ఎకనమిస్ట్‌’ వ్యాఖ్యానించింది.
 
ఆస్తిపర వర్గాలను, సామ్రాజ్యవాద దేశాలను నెత్తిన బెట్టుకుని కాపాడిన ది ఎకనమిస్ట్ వంటి పత్రికే ప్రపంచంలో పెరిగిపోతున్న వివక్షను, అసహనాన్ని సహించలేక అటు ట్రంప్‌ని, ఇటు మోదీని చెరిగిపారేయడం గమనార్హం.