శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (15:29 IST)

అంగట్లో అమ్మకానికి అమ్మాయిలు : ఇసిస్ ఉగ్రవాదుల సరికొత్త దుశ్చర్య!

తమ పైశాసిక దుశ్చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తాజాగా మరో దురాగతానికి పూనుకున్నారు. తాము అపహరించిన బాలికలు, యువతులను లైంగిక బానిసలుగా తెగనమ్ముతున్నారు. ఇందుకోసం ప్రాశ్చాత్య ధనవంతులకు వారు పిలుపునిచ్చారు. పైగా.. అమ్మాయిల విక్రయానికి సంబంధించి కరపత్రాలను సైతం పంపిణీ చేస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అమ్మాయిల ధరలతో పాటు.. వారి శరీర సౌష్టవం, కళ్ల రంగు, కురుల పొడవు తదితర వివరాలను కూడా పట్టికలో పొందుపరిచారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జైనబ్ బంగురా వెల్లడించినట్టు 'బ్లూమ్ బర్గ్' తెలిపింది. 
 
ఓ యేడాది వయసున్న చిన్నారులు అత్యధిక రేటు నిర్ణయించగా, 20 సంవత్సరాలు దాటిన అమ్మాయిల రేటు తక్కువగా నిర్ణయించారని బంగురా వెల్లడించారు. 1 నుంచి 9 సంవత్సరాల్లోపు బాలబాలికలను 165 డాలర్లకు విక్రయిస్తున్నారని, కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు 124 డాలర్ల వెల నిర్ణయించారని ఆయన వివరించారు. ఈ ఉగ్రవాదులు అమ్మకానికి పెట్టిన యువతులు ఎక్కువగా యాజిది, క్రైస్తవ తెగలకు చెందిన వారే ఉన్నారు. 
 
వీరిని వరుసగా నిలబెట్టి విక్రయాలు జరుపుతున్నారని, ఐదారుగురు ఐఎస్ఐఎస్ ఫైటర్లు కలసి ఒకరిని కొంటున్నారని తెలిపారు. కొన్ని సార్లు బానిసలను వారి సొంత కుటుంబాలకు అప్పగించేందుకు వేలాది డాలర్లు తీసుకుంటున్న ఘటనలూ ఇసిస్ ప్రాబల్య ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. వీరిని బానిసలుగా కొనుగోలు చేసేందుకు మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ధనవంతులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.