శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2016 (17:02 IST)

భారత్‌పై టార్గెట్.. ఐసిస్‌లో చేరిన లష్కరేతో పాటు పలు ఉగ్ర సంస్థలు.. లోయలో ఐసిస్ విస్తరణ?!

ప్రపంచ దేశాలను వణికిస్తూ.. విధ్వంసాలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ భారత్‌లో విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ ఆర్మీ పూర్తిగా సహకారం అందిస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. కాశ్మీర్‌లో దాడులు, భారత్‌లో అనిశ్చితి సృష్టించేందుకే.. పాకిస్థాన్ ఆర్మీతో కలసి ఐఎస్‌ఐ ఈ ఉగ్ర సంస్థలను సృష్టించిందని ఐసిస్ ఆన్‌లైన్ మేగజైన్ ‘దబిక్’ తెలిపింది. 
 
పాకిస్తాన్, అఫ్గాస్తాన్‌ల ఐసిస్ బాధ్యతను చూస్తున్న హఫీజ్ సయీద్ ఖాన్ అనే ఉగ్రనేత ‘దబిక్’కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ వివరాల్ని వెల్లడించారు. 2014 అక్టోబర్‌లో తాలిబాన్ సంస్థకు గుడ్‌బై చెప్పిన హఫీజ్ సయీద్ ఖాన్ మరో ఐదుగురు కమాండర్లతో కలిసి ఐసిస్‌లో చేరిన విషయాన్ని దబిక్ గుర్తు చేసింది. 
 
పాక్‌లో దుష్టశక్తులు, ముఖ్యంగా ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్, ఆర్మీ తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏవిధంగా ఉగ్రసంస్థల్ని సృష్టించి కశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడిందో మనకు తెలుసునని సయీద్ ఖాన్ తెలిపారు. ‘అల్లాకోసం, ముస్లింలకోసం కాకుండా.. వారి వ్యక్తిగత ఆసక్తుల కోసం కశ్మీర్ యువతను రెచ్చగొట్టార’ని విమర్శించారు. ఐఎస్‌ఐ చెప్పినట్లు వింటున్నందుకే.. కశ్మీర్‌లోని ఏ ప్రాంతంపైనా లష్కరే తోయిబాకు ఇంకా పట్టుచిక్కలేదన్నారు.
 
‘అధీనంలో ఉన్న పాకిస్తాన్‌లోనే అల్లా చట్టాన్ని అమలుచేయలేని వారు.. కశ్మీర్‌లో ఏ విధంగా అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తార’ని ప్రశ్నించారు. తమను ఎవరు కాపాడతారా అని కశ్మీర్ ప్రజలు ఎదురుచూస్తుంటే.. పాకిస్తాన్ తన స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కశ్మీర్‌లోని వివిధ ఉగ్రసంస్థల కార్యకర్తలు ఐసిస్‌లో చేరుతున్నారని..దీనివల్ల లోయలో ఐసిస్ విస్తరణకు మంచి ఛాన్సుందని తెలిపారు. 
 
ఈ ప్రాంతాల్లో ఖలీఫా రాజ్య స్థాపన గురించి ముస్లింలు త్వరలోనే ఓ శుభవార్త వింటారని సయీద్ తెలిపారు. అఫ్గానిస్తాన్  తాలిబాన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్, అతని సహచరులకు కూడా ఐఎస్‌ఐతో సత్సంబంధాలున్నాయని సయీద్ తెలిపారు. మన్సూర్ సలహా మండలిలోనూ ఐఎస్‌ఐ అధికారులు సభ్యులుగా ఉన్నారని సయీద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం తాలిబాన్ నాయకుడు హమీద్ గుల్ చనిపోయినపుడే ఈ విషయం బయటపడిందని సయీద్ ఖాన్ వెల్లడించారు.