శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (12:53 IST)

నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలి: ఇమ్రాన్ ఖాన్

ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని విజయం సాధించిన ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో ఫైనల్ మ్యాచ్‌కు తనతో పాటు వేలాది మంది తన మద్దతుదారులు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
 
నవాజ్ షరీఫ్ 48 గంటల్లోగా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ముస్లిం మత గురువు తాహిర్ ఉల్ ఖాద్రి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే విధమైన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
1992లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సారథ్య వహించిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత కొంత కాలానికి పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పేరుతో పార్టీని ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. 
 
ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు నవాజ్ షరీఫ్ నిరాకరిస్తే తమ మద్దతుదారులు ఇస్లామాబాద్‌లోని హై-సెక్యూరిటీ రెడ్ జోన్‌లోకి ప్రవేశించడం ఖాయమని, అవసరమైతే ఈ రోజే అంతిమ పోరాటానికి దిగుతామని ఇమ్రాన్ ఖాన్ పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఆపద్ధర్మ పాలకులతో పాటు రిటర్నింగ్ అధికారులతో కుమ్మక్కవడం వల్లనే నవాజ్ షరీఫ్ విజయం సాధించారన్న విషయం అందరికీ తెలుసని, ఈ విజయాన్ని పాక్ ప్రజలెవ్వరూ అంగీకరించడం లేదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ బుధవారంలోగా తప్పుకోవాలంటూ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. 
 
నేటితో గడువు ముగియనుండడంతో... గద్దె దిగకపోతే లక్షలాది మందితో షరీఫ్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. రెడ్ జోన్ మార్చ్‌‍కు మద్దతుదారులు తరలి రావాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు.