గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (12:40 IST)

టార్గెట్ ఎంహెచ్ 17 కాదు.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫ్లైటా?

గగనతలంలో ఎగురుతున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17ను నేలకు కూల్చివేసి 295 మంది ప్రాణాలు తీసింది ఎవరన్న అంశం ఇంకా తేలక ముందే.. ఈ విమాన ప్రమాదంపై భిన్నరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విమానాన్ని ఉక్రెయిన్ విమానం అనుకుని పొరపాటున తమవాళ్లే కూల్చివేసినట్టు ఉక్రెయిన్ వేర్పాటువాదుల దళ నేత ప్రకటించారు. అయితే, రష్యా మాత్రం మరో రకంగా చెపుతోంది. ఉక్రెయిన్ బలగాలే తమ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తోంది. 
 
నిజానికి విమాన ప్రమాదం సంభవించిన తర్వాత రష్యా నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. తమ దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడిన పుతిన్.. పనిలో పనిగా ఆయనకు విమాన ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఏంటన్న ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతోనో ఏమో గానీ.. ఈ సరికొత్త కుట్ర సిద్ధాంతం ఒకటి వెలుగులోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన క్షిపణి దాడి వల్ల విమానం కూలిపోయిందో మాత్రం నిర్ధారణ కాలేదు.
 
ప్రమాదం సంభవించడానికి దాదాపు గంట ముందుగా వార్సా సమీపంలో ఎంహెచ్ 17 విమానాన్ని పుతిన్ ప్రయాణిస్తున్న విమానం దాటిందని అనధికార వర్గాలను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ పేర్కొంది. దూరం నుంచి చూస్తే రెండు విమానాలు ఒకేలా ఉంటాయంటూ తెలిపింది. అందువల్లే పుతిన్ విమానాన్ని ఉక్రెయిన్ బలగాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడివుండొచ్చని ఆరోపిస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్ తిరుగుబాటుదారులే ఈ విమానాన్ని పేల్చి వేశారని వారే స్వయంగా ప్రకటించారు. మొత్తంమీద ఈ ప్రమాదంలో అంతర్జాతీయ నిపుణుల దర్యాప్తులోనే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.