శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (16:53 IST)

కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు అందుకే!: బాసిత్

భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్థాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. 
 
పాకిస్తాన్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించటానికో చర్చలు జరపడం కాదని పేర్కొంది. 
 
అదే సమయంలో, భారత్‌తో తమ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంటూ విదేశాంగ శాఖల కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు కావడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అన్నారు.  
 
కాగా వేర్పాటువాదులతో చర్చలు కావాలో లేదా భారత ప్రభుత్వంతో చర్చలు కావాలో పాకిస్తాన్ తేల్చుకోవాలని భారత్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాశ్మీర్ వేర్పాటువాదులతో తన చర్చలను బాసిత్ గట్టిగా సమర్థించుకున్నారు. కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనటానికి వేర్పాటువాదులతో తమ చర్చలు దోహదపడతాయన్నారు. 
 
ఆగస్టు 25న రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను భారత్ రద్దు చేసుకోవడం వెనుకపట్టే అవుతుందని, అయితే కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్న ఇరు దేశాలను ఇది నిరాశపరచకూడదని బాసిత్ అన్నారు. కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరపడంలో తాను ఎలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు.