శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (11:40 IST)

ఆఫ్రికా తూర్పు తీరంలో మలేషియా ఎంహెచ్ 370 విమాన శకలాలు!

గత యేడాది క్రితం అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు ఎంహెచ్ 370 (బోయింగ్ 777) విమానం శకలాలు ఆఫ్రికా తూర్పుతీరంలోని లా రీయూనియన్ అనే దీవి బీచ్‌లో గుర్తించారు. అయితే, ఇవి ఆ విమానానికి చెందిన శకలాలేనా లేదా అనేది నిర్ధారించాల్సి వుంది. 
 
గత యేడాది మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరగా, గగనతలంలోనే అదృశ్యమైన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో 239 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమాన శకలాల కోసం ఒక యేడాది పాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గాలింపు చర్యలను కూడా మలేషియా ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎమ్‌హెచ్‌-370 విమానానికి సంబంధించిన కీలక సమాచారం దొరికింది. 
 
ఆఫ్రికా తూర్పుతీరంలోని (మడగాస్కర్‌ సమీపంలో) లా రీ-యూనియన్‌ దీవి బీచ్‌లో స్థానికులు విమానం రెక్కను పోలిన శకలాన్ని (2.7 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల వెడల్పు) గుర్తించారు. ఇది మలేషియన్‌ విమానానిదే కావొచ్చని భావిస్తున్నారు. ఈ శకలాన్ని పరీక్షల నిమిత్తం ఫ్రాన్స్‌కు పంపించారు. అయితే ఇది ఎమ్‌హెచ్‌-370 విమాన శకలమా? కాదా? అనే విషయాన్ని పరీక్షల తర్వాతే నిర్ధారిస్తామని మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ తెలిపారు. 
 
ఇందుకోసం ఓ బృందాన్ని ఫ్రాన్స్‌ ల్యాబ్‌కు.. మరో బృందాన్ని లా రీ-యూనియన్‌ దీవికి పంపించినట్లు ఆయన చెప్పారు. ఈ రెండు బృందాలు, ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాకే అది.. బోయింగ్‌ 777 విమానం శకలమా? కాదా? అనే విషయాన్ని నిర్ధారిస్తామని.. అప్పటివరకు వదంతులను నమ్మొద్దని నజీబ్‌ సూచించారు.