శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (16:42 IST)

ఒంటి కన్ను ఒమర్ మృతి పట్ల కథనాలు విశ్వసించదగినవే: వైట్ హౌస్

ఆప్ఘనిస్థాన్ తాలిబన్ గ్రూప్ అధినేత ముల్లా ఒమర్ మృతి చెందినట్టు బీబీసీ వార్తా సంస్థ పేర్కొనడంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ స్పందించింది. ఒమర్ మృతిపై కథనాలు విశ్వసించదగినవేనని వైట్ హౌస్ ప్రతినిధి ఎరిక్ షుల్జ్ వెల్లడించారు. నిఘా వర్గాలు ఈ కథనాలను పరిశీలిస్తున్నాయని, ఒమర్ మరణానికి సంబంధించిన అంశాలను విశ్లేషిస్తున్నాయని షుల్జ్ తెలిపారు. 
 
తాలిబాన్ అధినేత అయిన ముల్లా ఒమర్‌ను ఒంటి కన్ను ఒమర్ అని పిలుస్తారు. కాగా, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి అనంతరం... అల్ ఖైదాకు ఆఫ్ఘన్‌లో మద్దతుగా నిలిచిన తాలిబాన్లపై అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దాంతో, ముల్లా ఒమర్ పాకిస్థాన్‌కు పారిపోయాడు.

అటు పిమ్మట జరిగిన దాడుల్లో ఒమర్ మరణించినట్టు ఎన్నో కథనాలు వచ్చాయి. వాటన్నంటినీ నిర్ధారించని ఆఫ్ఘన్ ప్రభుత్వం తాజా కథనంపై స్పందిస్తూ ముల్లా ఒమర్ మృతి చెందినట్లు ప్రకటించింది. ఒమర్ మృతిపై తాలిబన్ ఇంకా ధ్రువీకరించలేదు.