శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (18:38 IST)

చివరి క్షణంలో మనసు మార్చుకున్న చిన్నారి సూసైడ్ బాంబర్.. ఆ తర్వాత?

ఆ చిన్నారి సూసైడ్ బాంబర్‌గా మారింది. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకుని విధ్వంసాన్ని సృష్టించేందుకు వెనక్కి తగ్గింది. ఈశాన్య నైజీరియాలోని దిక్వా శరణార్థ శిబిరం వద్ద ఆత్మాహుతికి పాల్పడేందుకని ఆ బాలికతో పాటు మరో ఇద్దరు సూసైడ్ బాంబర్లను అక్కడికి తరలించారు. పేలుడు పదార్థాలు అమర్చిన జాకెట్లను ఆ ముగ్గురు ధరించారు. 
 
మారణహోమం సృష్టించేందుకు సమాయత్తమవుతున్న వేళ, ఒక్కసారిగా ఆ బాలిక మనస్సు మారింది. ఆత్మాహుతికి పాల్పడి వేలమందిని పొట్టనపెట్టుకోవడం తన వల్ల కాదని భావించింది. అంతే.. తాను ధరించిన పేలుడు పదార్థాల జాకెట్‌ను తీసి పక్కనపడేసి.. అక్కడ నుంచి పారిపోయింది. అయితే మిగిలిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు మాత్రం దిక్వా శరణార్థుల శిబిరం వద్ద తమను తాము పేల్చుకుని అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. 
 
ఇక తనను తాను పేల్చుకోవడానికి ఇష్టపడని ఆ చిన్నారి సూసైడ్ బాంబర్‌ను స్థానిక రక్షక దళాలు గుర్తించాయి. అమాయక ప్రజల్ని హతమార్చుతున్నామనే విషయాన్ని తెలుసుకున్న ఆ బాలిక చాలా మథనపడిందని.. అయితే ఆత్మాహుతికి పాల్పడాలనే ఉగ్ర నాయకుల ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు భయపడిందని  స్థానిక స్వీయ రక్షక దళ సభ్యుడు మొదూ అవామీ పేర్కొన్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆ బాలిక ఉగ్రవాదులకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించింది.