శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (10:57 IST)

అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం : ఉత్తర కొరియా

అగ్రరాజ్యం అమెరికాను కమ్యూనిస్టు రాజ్యం ఉత్తరకొరియా మరోసారి సవాల్ చేసింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా ఎపుడైనా సిద్ధంగా ఉన్నట్టు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ప్రకటించారు. వర్కర్స్‌ పార్టీ పాలనకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కిమ్-2 సుంగ్ స్క్వేర్‌లో కొరియా తన సైనిక పాటవాన్ని అసాధారణ స్థాయిలో ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రదర్శించింది. 
 
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఉన్ కొరియా ప్రసంగిస్తూ అమెరికా సృష్టించే ఎలాంటి యుద్ధాన్నయినా ఎదుర్కొనేందుకు మన విప్లవ సైన్యం సిద్ధంగా ఉన్నదని వర్కర్స్ పార్టీ ధైర్యంగా ప్రకటిస్తోంది. మా ప్రజలను, మాతృభూమిని రక్షించుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన ప్రకటించారు. 
 
అమెరికా మద్దతుతో పొరుగున ఉన్న దక్షిణకొరియాతో నిత్యం ఉద్రిక్తతలు తలెత్తుతుండటంతో ఉత్తరకొరియా ఇటీవలికాలంలో భారీగా ఆయుధాలను పోగేసుకొంటున్నది. సంప్రదాయ ఆయుధాలతోపాటు అణ్వాయుధాలను కూడా తయారుచేస్తున్నది. ఇప్పటికే మూడుసార్లు అణు పరీక్షలు నిర్వహించిన ఆ దేశం, మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.