గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR

బేషజాలు మరచి.. నవ్వుతూ.. కలివిడిగా కలిసిపోయిన ఒబామా!

తాను అగ్రరాజ్యాధిపతిని అనే విషయం న్యూఢిల్లీకి వచ్చిన అమెరికా అధినేత బరాక్ ఒబామా మరచిపోయారు. కొద్దిసేపు ప్రోటోకాల్ పక్కన పెట్టి.. నవ్వుతూ... కలివిడిగా తిరుగుతూ... అందరితో కలిసిపోయి తనతో వచ్చిన అమెరికా మంత్రులు, అధికారులను భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు పరిచయం చేశారు. 
 
ఆదివారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్న ఒబామా దంపతులు.. నేరుగా తనకు కేటాయించిన నక్షత్ర హోటల్‌కు చేరుకుని కొద్దిసేపు సేద తీరిన తర్వాత నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పారికర్, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన త్రివిధ దళాల వందనాన్ని ఒబామా స్వీకరించారు.
 
ఈ సందర్భంగా తాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిని అనే విషయం పూర్తిగా మరచిపోయారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత తొలుత కేంద్ర మంత్రులను ఒబామాకు ప్రధాని మోడీ పేరుపేరునా పరిచయం చేశారు. 
 
ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వచ్చిన ఒబామా, చివర్లో తన మంత్రివర్గ సహచరులను దగ్గరుండి మోడీ, ప్రణబ్ ముఖర్జీలకు పరిచయం చేశాడు. ముందు ప్రణబ్, వెనుక మోడీ నిలబడి ఉండగా, మధ్యలో ఉన్న ఒబామా బేషజాలు మరచి, ప్రొటోకాల్‌ను కాసేపు పక్కబెట్టి తనతో వచ్చిన అమెరికా మంత్రులను, అధికారులను నవ్వుతూ పరిచయం చేశారు.