గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (10:20 IST)

ఇస్లామిక్ స్టేట్‌ను భూమిపై లేకుండా చేస్తాం : బరాక్ ఒబామా హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తూ.. అగ్రరాజ్యం అమెరికాకే బహిరంగ సవాల్ విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్)కు శ్వేతసౌథం అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర హెచ్చరిక చేశారు. తమతో పెట్టుకుంటే భూమిపైనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. తమతో పోరాడలేకే పార్కులు, హోటల్స్, ఆలయాలు, రైల్వే స్టేషన్లపై ఐఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ.. తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ నగరంపై ఐఎస్ జరిపిన దాడులపై అగ్రరాజ్యం స్పందించలేదు. దీనిపై అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. వీటికి ఘాటుగానే సమాధానమిస్తూనే ఐఎస్‌పై అమెరికా వైఖరిని బరాక్ ఒబామా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే చర్యలు తీసుకుంటుందని, ప్రపంచశాంతి ముఖ్యమన్నారు. ఇస్లామిక్ స్టేట్ను ఎదుర్కోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని.. ఆ దిశగా ముందుకు వెళతామన్నారు. 
 
యుద్ధరంగంలో ఇస్లామిక్ స్టేట్ తమను ఎదుర్కోలేదని, ఆ భయంతోనే తమకు ఉగ్రవాద రంగు పులిమే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. మేం ఇస్లామిక్ స్టేట్‌ను ధ్వంసం చేస్తాం. అందుకోసం దానికి ఎక్కడి నుంచి నిధులు అందకుండా అడ్డుకట్ట వేస్తాం. మాకు ప్రపంచ ప్రజల ప్రాణాలు ముఖ్యం. మతపరంగా మాకు ఎలాంటి వివక్ష లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
 
పనిలోపనిగా ఐఎస్ స్థావరాలపై రష్యా చేస్తున్న దాడులపై కూడా ఆయన స్పందించారు. ఇటీవల రష్యా కూడా సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగిందని, అయితే, అవి నేరుగా ఇస్లామిక్ స్టేట్ అంతమొందించే లక్ష్యంతో దాడులు చేసినట్లుగా కాకుండా కేవలం తన ప్రత్యర్థిపై దాడులు చేసినట్లుగా ఉందన్నారు.