గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 6 జులై 2015 (07:11 IST)

నమస్కారమే మన సంస్కారం... ఎక్కడున్నా మూలాలను మరవొద్దు... వెంకయ్య నాయుడు

నమస్కారమే మన సంస్కారమని, ఎక్కడున్నా మూలాలను మరచిపోవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. అమెరికాలో జరుగుతున్న నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) వేడుకలకు మఖ్య అతిథిగా వెంకయ్య విచ్చేశారు. మోదీ అంటే ‘మేకింగ్‌ ఆఫ్‌ డెవలప్డ్‌ ఇండియా’ అని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రపంచదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతున్నాయని, త్వరలోనే అగ్రరాజ్యాల సరసన భారత్‌ నిలుస్తుందని చెప్పారు. 
 
మమ్మీ డాడీ సంస్కృతి వద్దని, అమ్మా నాన్న సంస్కృతిని అలవాటు చేసుకోవాలని కోరారు. విద్య నేర్చుకోవడానికి, సంపాదించడానికి విదేశాలకు వెళ్లిన భారతీయులు తిరిగి భారత దేశానికి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 
 
‘‘మీ బ్రెడ్‌ ముక్క మీరే తింటే... అది ప్రకృతి. వేరే వాళ్ళ బ్రెడ్‌ ముక్క లాక్కొని తింటే... అది వికృతి. కానీ మీ దగ్గర ఉన్న బ్రెడ్‌ ముక్కను ఇతరులతో పంచుకుంటే... అది సంకృతి. ఇదే మన భారత దేశ సంస్కృతి’’ అని తనదైన శైలితో చెప్పారు. ‘‘ఏబుల్‌ లీడర్‌ స్టేబుల్‌ గవర్నమెంట్‌’’ అంటూ చమత్కరించారు. తెలుగుజాతికి ఘనమైన చరిత్ర ఉందని, ఖండాంతరాలు దాటి వచ్చిన ప్రవాసాంధ్రులు తెలుగుజాతి ప్రతిష్ఠను అమెరికాలోనూ విస్తరింపజేయటం సంతోషకరమైన విషయమని వెంకయ్య అన్నారు. నాట్స్‌ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.