శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (17:11 IST)

తీవ్రవాదులు ఎవరైనా సరే పాకిస్థాన్ ఐఎస్ఐ గుప్పెట్లోనే.. న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం

ప్రపంచంలో ఉన్న తీవ్రవాద సంస్థలు లేదా తీవ్రవాదులు ఎవరైనా సరే.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ గుప్పెట్లోనే ఉన్నారనీ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తీవ్రవాదం అనేది కేవలం ఒక్క భారత్, ఆప్ఘనిస్థాన్ దేశాలకే పరిమితం కాలేదనీ, ప్రపంచ వ్యాప్తంగా ఉందనీ, చివరకు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు సైతం వారి ముప్పు తప్పలేదని పేర్కొంది. దీనికి సంబంధించిన అనేక సాక్ష్యాలను ఆ పత్రిక ప్రచురించింది. 
 
ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సంఖ్య పెరగడంతో పాటు, చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించడానికి ప్రధాన కారణం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కారణమనేనని తన ప్రత్యేక వ్యాసంలో ఆరోపించింది. ఈ సమస్య కేవలం ఆఫ్గనిస్థాన్‌కు మాత్రమే పరిమితం కాదు, చాలా దేశాల్లో ఉగ్రవాదుల సంఖ్య విస్తరించేందుకు ఐఎస్ఐ సాయపడిందని తెలిపింది. అంతర్జాతీయ ముజాహిద్దీన్ దళాలను, ముఖ్యంగా సున్నీ తీవ్రవాదాన్ని పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ పెంచి పోషిస్తోందని, ఇస్లామిక్ స్టేట్ విస్తరణలోనూ భాగముందన్న అనుమానాలున్నాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా అల్‌‍ఖైదా, తాలిబాన్ వర్గాలకు ఆశ్రయమివ్వడం పాక్ చేస్తున్న వాదనల్లో ఏమాత్ర నిజం లేదని తేల్చి చెప్పింది. అదేసమయంలో ఉగ్రవాదుల చర్యలకు పాక్ సైతం కొన్నిసార్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని గుర్తుచేసింది. పాక్‌లో హఖ్ఖానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ హఖ్ఖానీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, ఆయన రావల్పిండిలోని పాక్ ఇంటెలిజన్స్ ప్రధాన కార్యాలయానికి సైతం స్వేచ్ఛగా వెళ్లి వస్తుంటాడని ఆ కథనంలో పేర్కొంది. తాలిబాన్ల కొత్త నేత ముల్లా అఖ్తర్ ముహమ్మద్ మన్సూర్ సైతం పాక్ నగరం క్వెట్టాలో బహిరంగంగా సమావేశాలు నిర్వహిస్తున్నాడని తెలిపింది.