శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (14:01 IST)

మహాప్రభో.. మీకు దండం పెడతాం.. ఆ భారత్‌ను కట్టడి చేయండి.. ప్రపంచ బ్యాంకు వద్ద పాకిస్థాన్ మొర

దాయాది దేశం పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. భారత్‌ దూకుడును అడ్డుకోవాలని కోరింది. లేకుంటే తమ పని ఖతమైపోతుంది... చివరకు దాహం తీర్చుకునేందుకు సైతం గుక్కెడు మంచినీరు దొరకదని ప్రపంచ బ్యాంకు అధిక

దాయాది దేశం పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. భారత్‌ దూకుడును అడ్డుకోవాలని కోరింది. లేకుంటే తమ పని ఖతమైపోతుంది... చివరకు దాహం తీర్చుకునేందుకు సైతం గుక్కెడు మంచినీరు దొరకదని ప్రపంచ బ్యాంకు అధికారుల వద్ద వాపోయింది. దీనికి కారణం లేకపోలేదు. యూరీ దాడి తర్వాత పాకిస్థాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దౌత్య యుద్ధాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రత్యక్ష యుద్ధమంటూ చేస్తే ఇరు దేశాలు సర్వనాశనమై పోతాయని భావించిన ఆయన దౌత్య విధానాన్ని ఎంచుకున్నారు. తద్వారా అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
అదేసమయంలో సింధు జలాల ఒప్పందాన్ని కూడా ఏకపక్షంగా రద్దు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అలాగే, భారత్ నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లే నదులపై ఆనకట్టలపై ఆనకట్టలు కట్టేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని పునః సమీక్షిస్తామన్న భారత ప్రకటన పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దానిని అడ్డుకోవడానికి పొరుగు దేశం అంతర్జాతీయ వేదికలకు ఎక్కుతోంది. సింధూ జలాల ఒప్పందంపై అంతర్జాతీయ న్యాయస్థానంతోపాటు ప్రపంచ బ్యాంకునూ ఆశ్రయించింది. 
 
యురీ ఉగ్రవాద దాడి తర్వాత రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తామని సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి, ఇరు దేశాల మధ్య ప్రవహిస్తున్న ఆరు నదుల నీటి పంపిణీకి సంబంధించి 1960లో భారత, పాక్‌ ప్రధానులు నెహ్రూ, ఆయుబ్‌ ఖాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య నీటి పంపిణీకి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. 
 
దీని ప్రకారం, తూర్పున ఉన్న రావి, సట్లెజ్‌, బియాస్‌ నదులపై భారతకు అధికారాలు ఉంటే, పశ్చిమాన ఉన్న చీనాబ్‌, ఝీలం, సింధూ నదుల నియంత్రణ అధికారాలు పాకిస్థాన్‌ చేతిలో ఉంటాయి. ఈ నీరు కూడా భారత్ దయాదాక్షిణ్యాల మీదే వెళ్లాల్సి వుంది. ఈ నీరే తాగు నుంచి సాగు వరకూ పాకిస్థాన్‌కు ఆధారం. వీటిలో నీళ్లు లేకపోతే పొరుగు దేశంలో జల సంక్షోభం తప్పదు. ఈ నేపథ్యంలోనే, యురీ ఘటనకు ప్రతీకారంగా సింధూ జలాల ఒప్పందాన్ని పునః సమీక్షించే ఉద్దేశంతో ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, నీటి పంపిణీ ఒప్పందంలో భాగంగా, పాకిస్థాన్‌ నియంత్రణలో ఉన్న మూడు నదుల్లోని నీటిని గరిష్టంగా వాడుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. 
 
ఈనేపథ్యంలోనే, పాకిస్థాన్‌ అటార్నీ జనరల్‌ అష్తార్‌ ఆసఫ్‌ అలీ నేతృత్వంలోని బృందం మంగళవారం ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు సీనియర్‌ అధికారులను వాషింగ్టన్‌లో కలిసింది. ఈ సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన ప్రపంచ బ్యాంకు.. మిగిలిన అంశాలపై ఏమీ మాట్లాడలేదని తెలిసింది. అలాగే, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఆ వివరాలు బయటకు పొక్కకుండా పాక్ జాగ్రత్త వహించింది.