శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:25 IST)

భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే.. భారీ నష్టమే: ఆసిఫ్

భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్‌తో ఎటువంటి యుద్ధానికైనా సరే, తాము సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ సవాల్ విసిరారు. 
 
రేడియో పాకిస్థాన్ కార్యక్రమంలో ఆసిఫ్ పాల్గొన్నారు. శాంతి స్థాపనపై తమకు నమ్మకం ఉందని, అయితే దురుసుగా వ్యవహరిస్తే ఏవిధంగా సమాధానం చెప్పాలో కూడా తమకు తెలుసని ఆసిఫ్ హెచ్చరించారు. కాగా, భవిష్యత్‌లో చిన్నాచితక యుద్ధాలు రావచ్చని సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల భారత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్థాన్ మంత్రి పైవిధంగా కామెంట్ చేయడం గమనార్హం. 
 
గతంలో జరిగిన యుద్ధాలను గుర్తు చేసిన ఆసిఫ్..  1965లో లాహోర్‌ను ఆక్రమించామని.. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఎదురవుతుందన్నారు. పాకిస్థాన్ 50 ఏళ్ల కంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగివుందని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ సైన్యం కొన్నేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉందని ఆసిఫ్ గుర్తు చేశారు. తద్వారా భారత్‌కు బలమైన హెచ్చరికలను ఆసిఫ్ పంపారు. మరి భారత్ ఈ వ్యాఖ్యలపై ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.