శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (06:03 IST)

భారత్‌కు స్కార్పీన్‌ జలాంతర్గామి సిద్ధం :: జలాంతర్గామి అణు సామర్థ్య క్షిపణిని పరీక్షించిన పాక్‌

ఫ్రాన్స్‌ సహకారంతో నిర్మిస్తున్న ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాముల్లో రెండోదైన ఖందేరీ ఈ నెల 12న లాంఛనంగా జలప్రవేశం చేయనుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే చేతులు మీదగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఫ్రాన్స్‌ సహకారంతో నిర్మిస్తున్న ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాముల్లో రెండోదైన ఖందేరీ ఈ నెల 12న లాంఛనంగా జలప్రవేశం చేయనుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే చేతులు మీదగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ''సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే అతికొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్‌ భాగస్వామ్యంతో ముంబైలో మజ్గావ్‌ డాక్స్‌లో నిర్మిస్తున్న ఆరు జలాంతర్గాముల్లో మొదటిది కల్వరి సముద్ర పరీక్షల్లో ఉంది. త్వరలోనే ఇది నౌకాదళంలో చేరుతుంది'' అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. రెండో జలాంతర్గామికి మరాఠా బలగాలకు చెందిన ద్వీపకోట పేరిట ఖందేరీ అని పేరు పెట్టారు. 17వ శతాబ్దంలో సాగర జలాలపై పట్టు సాధించడంలో ఈ కోట కీలక పాత్ర పోషించింది. 
 
అలాగే, జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణు సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్రూయిజ్‌ క్షిపణిని పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది. హిందూ మహాసముద్రంలోని గుర్తుతెలియని ప్రదేశం నుంచి పరీక్ష చేపట్టింది. దీంతో దేశానికి విశ్వసనీయమైన రెండోదాడి సామర్థ్యం సొంతమైందని సైన్యం ప్రకటించింది. జల అంతర్భాగంలోని మొబైల్‌ వేదిక నుంచి బాబర్‌-3 క్షిపణిని పరీక్షించగా, లక్ష్యాన్ని నిక్కచ్చిగా ఛేదించినట్లు పాక్‌ సైన్యం మీడియా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. బాబర్‌-3 450 కి.మీ.దూరందాకా వార్‌హెడ్లను తీసుకెళ్లగలదు. క్షిపణి పరీక్ష విజయవంతంగా చేపట్టడంపై ప్రధాని నవాజ్‌షరీఫ్‌ దేశానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు.